ఆదివాసీ హక్కుల కోసంఐక్య పోరాటం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ హక్కుల కోసంఐక్య పోరాటం

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,

ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పిలుపు

ముంచంగిపుట్టులో ఘనంగాఆదివాసీ దినోత్సవం

గిరిజన పోరాట యోధులవిగ్రహాల ఆవిష్కరణ

నృత్యాలు చేస్తూ సందడి

ముంచంగిపుట్టు: రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆదివాసీలు ఐక్యంగా పోరాటాలు చేయాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబులు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కొంతమంది మహిళలు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్రతో పాటు మాజీ ఎంపీ గోడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి దింసా నృత్యాలు చేశారు. ‘జై ఆదివాసీ’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గిరిజన పోరాట యోధులు కొమరం భీమ్‌, బిర్సా ముండా, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలేల విగ్రహాలను ఆవిష్కరించి, నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాటాలు చేయాలని అన్నారు. గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, సంక్షేమమే అందరి లక్ష్యం కావాలని ఆయన అన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కుల కోసం ఆదివాసీ బిడ్డలు పాటుపడాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో అన్ని హక్కులు ఆదివాసీలకే దక్కుతాయని, ఇక్కడి ఖనిజ సంపద, అటవీ సంపద, ఆస్తులన్నింటిపై సర్వాధికారాలు ఆదివాసీలకే ఉన్నాయని అన్నారు. నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందేలా జీవోను విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్‌ 3ను వెంటనే పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. ఆదివాసీలు చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం గుర్తించి, సమావేశాలతో కాలక్షేపం చేయకుండా స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన అన్నారు. అరకు మాజీ ఎంపీ మాధవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో జీవో నంబర్‌ 3 రద్దుతో గిరిజనులు భారీగా ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని అన్నారు. జీవో నంబర్‌ 3కు ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని, గిరిజన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ఆమె అన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. గిరిజన భూములను బడాబాబులకు అప్పగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఆదివాసీ దినోత్సవం రోజునైనా జీవో నంబర్‌ 3పై సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలని, కానీ లేనిపోని సాకులతో గిరిజనులను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీపీ అరిసెల సీతమ్మ, వైస్‌ ఎంపీపీలు సత్యనారాయణ, భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ జగబంధు, గిరిజన ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు బాబురావు, వివిధ పార్టీల నేతలు రమేష్‌, బాబురావు, సూరయ్య, సన్యాసిరావు, త్రినాథ్‌, మూర్తి, గాసిరావు, అప్పాలు, రఘునాథ్‌, నానిబాబు, సుభాష్‌, అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గిరిజనులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement