బాబు మార్క్‌ మోసం! | - | Sakshi
Sakshi News home page

బాబు మార్క్‌ మోసం!

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

సీఎం చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చారు.. ఇక మా బతుకులు మారతాయని ఆశపడ్డాం. ఏడాది గడిచిపోయింది.. కానీ ఇల్లు రాలేదు.. దుకాణం నిర్మించలేదు. ఎవరిని అడగాలో.. ఎవరిని కలవాలో తెలియడం లేదు. ముఖ్యమంత్రి హామీతో కొత్త జీవితంపై ఆశలు పెట్టుకున్న వంజంగి ఆదివాసీ మహిళలు వంతాల కొండమ్మ, కొమరం మణి ఆవేదన ఇది. పేదరికం నుంచి బయటపడతామని ఎదురుచూసిన వారి ఆశలు ఏడాది తర్వాత కూడా నెరవేరలేదు. హామీ ఇచ్చిన ఇల్లు, దుకాణం కోసం ఇప్పటికీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

సాక్షి, పాడేరు: మండలంలో వంజంగి గ్రామంలో గత ఏడాది ఆగస్టు 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. గిరిజనులతో మమేకమయ్యారు. వంతాల కొండమ్మ అనే వ్యవసాయ కూలీ ఇంటికి చంద్రబాబు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సీఎం స్వయంగా తమ ఇంటికి రావడంతో కొండమ్మ సంబరపడింది. ఆయనకు కొండమ్మ రాఖీ కట్టింది. ఆ సమయంలో కొండమ్మ పేదరికం, కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు ఆమెకు పలు హామీలు ఇచ్చారు. పాత రేకుల ఇంటిలో ఉన్న కొండమ్మకు శ్లాబ్‌ ఇంటిని నిర్మించడంతో పాటు జిల్లా కేంద్రం పాడేరులో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేలా దుకాణ నిర్మాణం చేపట్టి అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా తమకు మంచి జీవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కొండమ్మ కుటుంబం సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వంజంగిలోని తోటి గిరిజనులు కూడా సంతోషించారు.

ఏడాదైనా పాత ఇల్లే గతి

వంతాల కొండమ్మకు సీఎం చంద్రబాబు ఇచ్చిన పక్కా ఇల్లు, దుకాణం హామీ నెరవేరలేదు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగి ఏడాది అవుతున్నా ఇంటి నిర్మాణం, పాడేరులో దుకాణ నిర్మాణం జరగలేదని ఆదివాసీ మహిళ కొండమ్మ వాపోతోంది. ఏడాది నుంచి సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఎదురుచూస్తున్నా ఫలితం లేదని, కనీసం ఇల్లు మంజూరు పత్రం కూడా అధికారులు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నెల 4న వెలుగు అధికారులు ఆకస్మికంగా వచ్చి బ్యాంకు రుణం ఇస్తామని, పాడేరులో కొట్టు సొంతంగా కట్టుకుంటారా అని అడిగారని కొండమ్మ తెలిపింది. రుణం ఇస్తే.. సీఎం చంద్రబాబు ఆదుకుంటానన్న హామీకి ఫలితం ఏమిటని ఆమె ప్రశ్నిస్తోంది. ఇల్లు, దుకాణం రెండింటి నిర్మాణానికి సీఎం ఇచ్చిన హామీలు తమ కుటుంబానికి అమలుకాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

మరో కుటుంబానిదీ అదే పరిస్థితి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వంజంగి గ్రామంలో జరిగిన సదస్సులో ఆదివాసీ మహిళ కొమరం మణితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. పక్కనే గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, ఇతర అధికారులు ఉన్నారు. భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి సొంత ఇల్లు కూడా లేని మణి కుటుంబ పరిస్థితిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ కుటుంబానికి కూడా పక్కా ఇల్లు, మణి టైలరింగ్‌ వృత్తికి సంబంధించి దుకాణం నిర్మాణం చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న ఓ అధికారి గిరిజాకు ఆయా బాధ్యతలు అప్పగించారు. సీఎం హామీతో తమ బతుకులు బాగుపడతాయని పేదరికంతో మగ్గిపోతున్న మణి ఆశపడింది. కానీ ఏడాది అయినా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు.

పరాయి పంచన జీవనం

కొమరం మణి జీవన పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ముగ్గురు పిల్లలు, మద్యానికి బానిసైన భర్తతో కలిసి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉండటానికి సొంత ఇల్లు లేకపోవడంతో తన పెదనాన్న ఇంట్లో కుటుంబమంతా తలదాచుకుంటోంది. అదే ఇంటి వరండాలో టైలరింగ్‌ వృత్తి చేస్తూ జీవనోపాధి పొందుతోంది. సీఎం చంద్రబాబు తనకు ఇచ్చిన ఇల్లు, దుకాణం నిర్మాణాల హామీ అమలుకాలేదని, ఏడాది పూర్తయినా న్యాయం జరగలేదని మణి ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దత్తత తీసుకున్నానని, అన్నీ తానే చూసుకుంటానని ఆ రోజు చెప్పిన గిరిజా అనే అధికారి రూ.10 వేలు మాత్రమే తన బ్యాంకు ఖాతాకు పంపారని, ఆ తర్వాత పట్టించుకోలేదని వాపోయింది. ఇల్లు, దుకాణం కోసం అనేకసార్లు ఫోన్‌ చేసినా ఆ అధికారి నుంచి స్పందన లేదని, ఇక ఎవరిని కలవాలో తెలియక మౌనంగా ఉండిపోయామని తెలిపింది. ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన ఇల్లు, దుకాణం నిర్మాణాల హామీ ఏడాదిగా అమలుకాకపోవడం బాధగా ఉందని మణి ఆవేదన వ్యక్తం చేసింది.

ఏడాదైనా అమలుకు నోచుకోని సీఎం ఆదివాసీ దినోత్సవ హామీ

గాలిలో కలిసిపోయిన వాగ్దానం

నిరాశకు గురైన ఆదివాసీ మహిళలు కొండమ్మ, మణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement