8లో
జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ డిమాండ్‌తో మన్యంలో చేపట్టిన బంద్ పాడేరులో ఉద్రిక్తతకు దారితీసింది. బంద్‌కు మద్దతుగా రోడ్డెక్కిన గిరిజన సంఘాల నేతలను పోలీసులు పలుమార్లు అడ్డుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల రాకపోకలను కొనసాగించారు. పోలీసుల నిర్బంధ చర్యలను వైఎస్సార్‌సీపీ నేతలు, ఆందోళనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో ఎన్నికల హామీ మేరకు జీవో నంబరు 3ను పునరుద్ధరించి 100 శాతం ఉద్యోగాల కల్పనకు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే తీసుకురావాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ చేశారు.
హక్కుల సాధనకోసం రోడ్డెక్కిన గిరిజన సంఘాలు
●పాడేరులో ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు
●పలువురిని అదుపులోకి తీసుకున్న బలగాలు
●పోలీసుల చర్యలను వ్యతిరేకించిన గిరిజనం
●చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుచేయాల్సిందే ..
●పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు డిమాండ్
●గిరిజన చట్టాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరిక
సాక్షి, పాడేరు: గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు జీవో నంబర్ 3ను పునరుద్ధరించి, 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. జీఓ–3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం గిరిజన సంఘాలు శనివారం చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, పాత బస్టాండ్ వద్ద ఆందోళనలో పాల్గొన్నారు. జీఓ–3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ కోరుతూ నినాదాలు చేశారు. విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా గిరిజనులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. 100 శాతం ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యామ్నాయ జీవో తీసుకురావాలని, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వైఎస్సార్‌సీపీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. గిరిజన సంఘాలు శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే పోలీసుల నిర్బంధం ద్వారా అడ్డుకోవడం దారుణమన్నారు.
ఆదివాసీలతో కూటమి ఆటలు :
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి
కూటమి ప్రభుత్వం ఆదివాసీలకు అన్యాయం చేసే చర్యలకు పాల్పడుతూ వారి జీవితాలతో ఆటలాడటం అన్యాయమని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. గతంలో జీవో నంబర్ 97ను దుర్మార్గంగా తీసుకువచ్చి గిరిజనుల బాకై ్సట్ సంపదను తవ్వుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి గిరిజన చట్టాల జోలికి రావడం దారుణమన్నారు. నూరు శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవోను సీఎం చంద్రబాబు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్‌కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కుడా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ జిల్లా, స్థానిక నాయకులు లకే రామసత్యవతి, పాంగి నాగరాజు, పాంగి సత్తిబాబు, వనుగు బసవన్నదొర, సిరగం దశమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ప్రశాంతంగా..
జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల పరిరక్షణ డిమాండ్‌తో గిరిజన సంఘాలు చేపట్టిన రాష్ట్ర మన్యం బంద్ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఆందోళనకారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బంద్ నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు గిరిజన సంఘాల నేతలు అప్పలనరస, పాలికి లక్కు, సుందర్రావు, రాధాకృష్ణ, కాంగు చిన్నిలు ప్రయత్నించారు. పోలీసులు వారిని పలుమార్లు అడ్డుకున్నారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సుల రాకపోకలను కొనసాగించారు. ప్రైవేట్ వాహనాల సర్వీసులు మాత్రం నిలిచిపోయాయి. పాడేరు పట్టణంతో పాటు మండలంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. 100 శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవోను వెంటనే ప్రకటించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీసుల నిర్బంధ చర్యలను నిరసించారు. గిరిజనుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనరస హెచ్చరించారు.
జీవో నంబరు 3పై సీఎం హామీ అమలు చేయాలి : అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్
అరకులోయ టౌన్: గిరిజన చట్టాల పరిరక్షణ, గిరిజనులకు 100 శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవో నంబర్–3ను పునరుద్ధరించాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. జీవో–3పై సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. శనివారం అరకులోయలో నిర్వహించిన మన్యం బంద్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన 1/70 భూ బదలాయింపు చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలన్నారు. మైదాన ప్రాంతానికి చెందిన చేబోలు లీలాప్రసాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో జీవో–3 రద్దయిందని పేర్కొన్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఉద్యోగాల ప్రయోజనం గిరిజనులకు దూరమైందన్నారు. 1/70 చట్టం, ఎల్‌టీఆర్ నిబంధనలను అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. అరకులోయ, పాడేరు, చింతపల్లి వంటి పర్యాటక ప్రాంతాల్లో గిరిజనేతరులు రోడ్ల పక్కన దుకాణాలు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు గిరిజనేతరులు గిరిజనుల ఉద్యోగాలను పొందుతున్నారని ఆరోపించారు. అలాంటి వారు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
●మన్యం బంద్ సందర్భంగా అరకులోయలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు కూడా మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచే వైఎస్సార్‌సీపీ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు రోడ్డుపైకి వచ్చి వాహన రాకపోకలను నియంత్రించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, ఎంపీటీసీ దురియా ఆనంద్‌కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పల్టాసింగ్ విజయ్‌కుమార్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, సీపీఎం నేతలు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్, రామారావు, ఉమామహేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
మూతపడిన పర్యాటక ప్రాంతాలు.. ఇబ్బందులు పడ్డ సందర్శకులు
గిరిజన హక్కుల జోలికొస్తే.. ప్రజా ఉద్యమం తప్పదు
ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర


