నర్సీపట్నం: ఈ నెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాపిరెడ్డి నారాయణమూర్తి కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జైలు భరో కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన తదితర స్కీమ్ వర్కర్లకు కనీసం వేతనం రూ.31 వేలు చెల్లించాలని, అన్ని పంటలకు పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధర చెల్లించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించడంతో పాటు రోజుకు రూ.700 కూలి చెల్లించాలని. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కోరారు. దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, అంకంరెడ్డి చిన్నంనాయుడు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.


