దిశ చట్టం బిల్లు ఉపసంహరణ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

దిశ చట్టం బిల్లు ఉపసంహరణ అన్యాయం

Aug 8 2026 12:47 AM | Updated on Aug 8 2026 12:47 AM

మహిళల రక్షణకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు

వైఎస్సార్‌సీపీ మహిళా నేతల ఆగ్రహం

సాక్షి, పాడేరు: దిశ చట్టం బిల్లును కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మహిళల రక్షణకు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, మహిళా నేత, విజయనగరం మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, చింతపల్లి, గూడెంకొత్తవీధి ఎంపీపీలు కోరాబు అనూషాదేవి, బోయిన కుమారి శుక్రవారం పాడేరు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ బాలికపై జరిగిన అమానుష ఘటనతో చలించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రిగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టారని వారు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల బాలికలు, మహిళలు దిశ యాప్‌ ద్వారా రక్షణ పొందారని పేర్కొన్నారు. ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు దిశ చట్టం ద్వారా పోలీసులు సత్వరం స్పందించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు బాధిత బాలికలు, యువతులు, మహిళలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో 12 మహిళా కోర్టులు, 13 దిశ కోర్టులను ఏర్పాటు చేశారని వారు గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మహిళలకు అన్ని విధాలా రక్షణ ఉండేదని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు. మహిళల రక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం.. మహిళలకు మేలు చేసే దిశ చట్టాన్ని రద్దు చేయడం సమంజసం కాదని విమర్శించారు. దిశ చట్టం కారణంగా మహిళల్లో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆదరణ పెరుగుతుందనే భయంతోనే సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో దిశ చట్టం బిల్లును ఉపసంహరించుకున్నారని ఆరోపించారు. దిశ చట్టం రద్దు చర్యలను మహిళా లోకం మొత్తం నిరసిస్తుందని, కూటమి ప్రభుత్వం వెంటనే క్యాబినెట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మహిళల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అరకు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పూర్ణిమాదేవి, మహిళా విభాగం మండల కార్యదర్శి లకే రామసత్యవతి, ఎంపీటీసీ కిలగాడ సింహాచలం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement