తల్లిపాలే పిల్లలకు శ్రీరామ రక్ష పుట్టిన మొదటి గంట నుంచి ఆరు నెలలు ఇవ్వాలి దీర్ఘకాల వ్యాధులకు దూరం
తల్లికీ ప్రయోజనమే..
పిల్లలకు పాలివ్వడం వల్ల పిల్లలతో పాటు తల్లికీ ప్రయోజనముంది. పాలివ్వడం వల్ల గర్భాశయం పూర్వ స్థితికి చేరుకుంటుంది. అలాగే ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది. అదనపు కేలరీలు ఖర్చు అవడం వల్ల గర్భధారణ సమయంలో పెరిగిన బరువు సహజంగా తగ్గుతుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తల్లిపాలలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల తల్లిలో ఒత్తిడి తగ్గి, బిడ్డతో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది.
అనకాపల్లి టౌన్: శిశువు జన్మించిన వెంటనే అందించే తల్లిపాలు జీవితాంతం శిశువుకు శ్రీరామ రక్షగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల ప్రకారం పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరం. తొలి ఆరు నెలల వరకు నీరు కూడా ఇవ్వకుండా తల్లి పాలే అందించాలి. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మెదడు ఎదుగుదలతో పాటు శారీర వక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి దగ్గు, డయేరియా, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఈ తల్లిపాలు త్వరగా అరిగిపోయి జీర్ణమవుతాయి. త్వరగా అరిగిపోవడం వలన కడుపునొప్పి, మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవ్వవు. అలాగే భవిష్యత్‌లో ఆస్తమా, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు తగ్గిపోతాయి.
అమూల్య ఆహారం
తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమ్యూలమైన ఆహారం. వైద్యుల సూచనలు పాటిస్తూ తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి. ఈ దశలో నీరు, తేనె, ఇతర ఆహారాలు అవసరం ఉండదు. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువుకు శిశువును అనేక అంటువ్యాధుల నుంచి కాపాడతాయి. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి కూడా త్వరగా కోలుకుంటుంది.
–డాక్టర్ బి. సౌజన్య, గైనకాలజిస్ట్, ఎన్టీఆర్ ఆసుపత్రి, అనకాపల్లి


