పచ్చని పల్లెల్లో ధ్వంసరచన | - | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెల్లో ధ్వంసరచన

Aug 6 2026 12:45 AM | Updated on Aug 6 2026 12:45 AM

కూటమి పాలనలో కొనసాగుతున్న శిలాఫలకాల విధ్వంసం

ఎం.అలమండలో తాజాగా సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసం

గత ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేక విధ్వంసకాండ

పోలీసులకు మాజీ సర్పంచ్‌ ఫిర్యాదు

దేవరాపల్లి: మండలంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాల విధ్వంసకాండ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు గ్రామాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎం.అలమండలో గాడి వారి కల్లాలకు వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో దాడి వారి కల్లాలకు సీసీ రోడ్డు నిర్మించి దశాబ్దాల రహదారి సమస్యను పరిష్కరించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఓ మూలన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఽఉద్దేశ్య పూర్వకంగా ధ్వంసం చేయడం వివాదాస్పదమైంది. వైఎస్సార్‌సీపీ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన సంక్షేమాభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో ఉద్దేశ్య పూర్వకంగా ఽప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని గ్రామస్తులు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శిలాఫలకం ధ్వంసంపై స్థానిక తాజా మాజీ సర్పంచ్‌ దాడి జగన్నాథరావు(జగన్‌) మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కాగా గతంలో ఇదేవిధంగా దేవరాపల్లి సంతతోట వద్ద దేవరాపల్లి–చిననందిపల్లి తారు రోడ్డు నుంచి చేనులపాలేనికి రూ.1.21 కోట్లతో నిర్మించిన తారు రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఽగత ఏడాది మార్చిలో దుండగులు ధ్వంసం చేశారు. పెదనందిపల్లి కాలనీలో సైతం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆయా ఘటనలపై అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా శిలా ఫలకాల ధ్వంసం చేసే విష సంస్కృతిని తీసుకురావడం పట్ల మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేసి గ్రామాలలో తమ పేర్లతో నూతనంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసే చర్యలు తగదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement