వినతుల పరిష్కారంపై అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

వినతుల పరిష్కారంపై అసంతృప్తి

Aug 4 2026 1:05 AM | Updated on Aug 4 2026 1:05 AM

కలెక్టరేట్‌ వద్ద కనీస సౌకర్యాలూ కరువు

చెట్ల కిందే కుటుంబ సభ్యుల

ఎదురుచూపులు

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌కు 315 అర్జీలు

తుమ్మపాల: వివిధ మండలాలు, గ్రామాల నుంచి తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యయప్రయాసలతో కలెక్టరేట్‌కు చేరుకున్న వీరికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో గంటల తరబడి చెట్ల కిందే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు దగ్గర నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్ల కారణంగా సగం రోజంతా వేచి ఉండాల్సి వస్తోందని అర్జీదారులు వాపోతున్నారు. కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద నుంచే వినతుల విభాగానికి ఒక లైన్‌, అర్జీల ఆన్‌లైన్‌ నమోదు కోసం మరో లైన్‌, అనంతరం పీజీఆర్‌ఎస్‌ వేదిక వద్దకు వెళ్లేందుకు మరో రెండు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఒక్క వినతిని సమర్పించేందుకు మూడు గంటల సమయం పడుతోందని, తీరా జిల్లా అధికారులు వద్దకు వెళ్లేసరికి అర్జీని తీసుకుని సంబంధిత శాఖ అధికారికి అందించి చేతులు దులుపుకుంటున్నారని అర్జీదారులు చెబుతున్నారు. జిల్లా స్థాయి అధికారుల ఎదుట తమ సమస్యలను వివరించినప్పటికీ, అనేక వినతులు పరిష్కారం కాకుండానే ముగుస్తున్నాయని, ఒకే సమస్యపై పలుమార్లు కలెక్టరేట్‌కు వచ్చినా క్షేత్రస్థాయి విచారణ లేకుండానే అర్జీలను ముగించడం పరిపాటిగా మారిందంటున్నారు. పునరావృత అర్జీలపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.

టూరిజం, దేవాదాయ శాఖ అధికారుల కలెక్టర్‌ ఆగ్రహం

అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ల కార్యక్రమంలో ఆమెతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్‌వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల వినతులపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా, అర్జీలను పెండింగ్‌లో పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ పురోగతి లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ప్‌ అందించిన అర్జీల పరిష్కార వేగాన్ని పెంచి, అన్ని అర్జీలను వెంటనే క్లియర్‌ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజలను తిప్పించుకునే అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌– 170, రెవెన్యూ క్లినిక్‌– 145 అర్జీలు మొత్తం – 315 అర్జీలు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement