దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండలో సోమవారం సాయంత్రం పిడుగు పడి గ్రామానికి చెందిన సిరపరపు నాయుడు (51) మృతి చెందారు. మరో రైతు ఆళ్ల సన్యాసినాయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎం.అలమండకు చెందిన సిరపరపు నాయుడు కుటుంబంతో కలిసి సుజాతనగర్‌లో నివాసం ఉంటున్నారు. పొలం పనులు చేయించేందుకు సోమవారం ఉదయం స్వగ్రామం ఎం.అలమండకు వచ్చారు. కూలీలతో పనులు చేయిస్తుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో భారీ శబ్ధంతో కూడిన పిడుగు నేరుగా నాయుడుతో పాటు ప్రక్కనే ఉన్న సన్యాశినాయుడుపై పడింది. దీంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడ ఉన్నవారంతా స్పృహ తప్పి పడిపోయిన వారిద్దరినీ కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి సిరపరపు నాయుడు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న సన్యాసినాయుడును మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్‌కు తరలించారు. మృతుడికి భార్య శిరీషతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పొలం పనులు చేయించేందుకు వచ్చిన నాయుడు పిడుగుపాటుకు గురై మృతిచెందడంతో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. నాయుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక మాజీ సర్పంచ్ పోతల లక్ష్మీ భర్త, వీఆర్‌వో పోతల శంకరావుకు నాయుడు స్వయాన మేనల్లుడు. దీంతో ఎం.అలమండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై బాధిత కుటుంబీకులు తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ డిప్యూటీ సీఎం బూడి సంతాపం
సిరపరపు నాయుడు మృతికి మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు తదితర నాయుకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం వెలిబుచ్చారు.


