స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం, పోలీసుశాఖ పని చేస్తోందని స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంకల్పం 2.0 మెగా గంజాయి అవగాహన కార్యక్రమాన్ని స్టార్ హోమ్స్ ఫంక్షన్ హాల్‌లో సోమారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు మీడియా, విద్యార్థులు, తల్లిదండ్రులు బాధ్యతయుతంగా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి నిర్మూలనకు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ గత కొద్ది కాలంగా గంజాయి సాగు, అక్రమ రవాణాను 90 శాతంకు పైగా అరికట్టగలిగామన్నారు. చెక్‌పోస్టులు, నిఘా కెమెరాలు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సహాయంతో అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామన్నారు. గంజాయి వినియోగాన్ని తుడిచిపెట్టాలంటే ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. మత్తుకు బానిసలైన వారిని నేరస్తులుగా చూడకుండా డి–ఎడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి చికిత్స అందించి పునరావసం కల్పిస్తామన్నారు. సినీ నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ యువత తమ లక్ష్యాల వైపు పయనించాలి తప్ప వ్యసనాల బారినపడి తల్లిదండ్రులు కన్న కలలను తుంచవద్దన్నారు. పోలీసుల ఈ సంకల్పం 2.0 ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల రక్షణ కోసం 112, గంజాయి సమాచారం అందించడానికి 1972 టోల్ ఫ్రీ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామన్నారు. మత్తు పదార్ధాల దుష్ఫరిణామాలపై విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో సీఐలు గపూర్, రేవతమ్మ, మురళి, రామకృష్ణ, సతీష్, పిల్లా రమేష్, ఈగల్ ఇన్‌స్పెక్టర్లు దేవుళ్లు, నాగరాజు, ఎస్సైలు రాజారావు, ఉమామహేశ్వరరావు, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.


