బకులూరు రంగురాళ్ల క్వారీ తవ్వకాలు అడ్డగింపు
● అనుమతులు రద్దుచేయాలని
గ్రామంలో ఒక వర్గం డిమాండ్
● వ్యతిరేకంగా ఆందోళన
కొయ్యూరు: మండలంలోని బకులూరు రంగురాళ్ల క్వారీ అనుమతులు రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఆదివారం పనులను అడ్డుకున్నారు. రంగురాళ్ల క్వారీ నిర్వహణకు ఇదే పంచాయతీ అంకంపాలెంకు చెందిన పొట్టిక సత్యనారాయణ అనుమతులు పొందారు. ఈ మేరకు ఆయన ఆదివారం జేసీబీతో కొండను తవ్వేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ కిషోర్‌వర్మ, సిబ్బందితో క్వారీ ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికుల్లో ఒక వర్గం క్వారీ నిర్వహణకు మద్దతు తెలపగా, మరో వర్గం వ్యతిరేకించడంపై ఎస్‌ఐపై స్పందించారు. క్వారీ నిర్వహణకు అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని ఆందోళనకారులకు సూచించారు. ఇలావుండగా క్వారీ అనుమతులకు సంబంధించి గ్రామ సభ నిర్వహించి, మెజారిటీ అభిప్రాయాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్థానికులు తెలిపారు.


