పర్యాటకంపై పిడుగు
ఉపాధిపై తీవ్ర ప్రభావం
ప్రతీరోజు మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద టీ స్టాళ్లు ద్వారా 40 మంది ఉపాధి పొందుతున్నాం. సీజన్‌లో ప్రతీ రోజు ఒక్కో స్టాల్‌లో రూ. 700 నుంచి రూ. 800 వరకు ఆదాయం వచ్చేది. కొద్దిరోజులుగా ప్రభుత్వం విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్ల సందర్శకుల సంఖ్య బాగా తగ్గింది. దీనివల్ల ఆదాయం తగ్గిపోవడమే కాకుండా ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది.
– బారికి డాలిమ్మ, మాడగడ
ఆదాయం కోల్పోయాం
పర్యాటకులకు అరకు రావద్దంటూ విధించిన ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌లో పర్యాటకులకు తెల్లటి పంచె, చిలకట్టు, లాల్చీ, తలపాగ, కండువాతో అలంకరణకు ఒక్కరికి రూ. 50 నుంచి వంద తీసుకుంటాం. తద్వారా 16 మందికి ఉపాధి లభిస్తోంది. కొద్దిరోజులుగా పర్యాటకుల రాకతగ్గడంతో ఆదాయం కోల్పోయాం.
– మండియకేడి మోహన్‌బాబు, మాడగడ
● రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ● వన్‌వే ట్రాఫిక్ ఆంక్షలతో కుదేలు
● పర్యాటకుల్లో భయాందోళనలు ● తగ్గిపోతున్న సందర్శకుల సంఖ్య
● దూరమవుతున్న ఉపాధి మార్గాలు ● అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం
పాడేరు/అరకులోయ టౌన్: ప్రకృతి ఒడిలో సేదతీరాలని వచ్చే పర్యాటకులతో కళకళలాడాల్సిన అరకులోయ పరిసరాలు ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో ఎస్.కోట – అరకు మార్గాన్ని వన్‌వేగా మార్చడం, తిరుగు ప్రయాణాన్ని పాడేరు మీదుగా మళ్లించడం అరకు పర్యాటక రంగానికి గొడ్డలి పెట్టులా మారింది. భద్రత ముసుగులో తీసుకున్న ఈ నిర్ణయం, వేలాది మంది గిరిజన కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది.
పర్యాటకుల్లో గుబులు
సాధారణంగా పర్యాటకులు వెళ్లేటప్పుడు గమ్యాన్ని చేరుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కానీ, తిరిగి వచ్చేటప్పుడే నిదానంగా స్థానిక వస్తువులను కొనుగోలు చేస్తారు. అరకు కాఫీ, మిరియాలు, అడవి తేనె, హస్తకళా రూపాలను పర్యాటకులు తిరుగు ప్రయాణంలోనే ఎక్కువగా కొంటారు.
● ఘాట్ రోడ్డు పొడవునా ఉండే వ్యూ పాయింట్లు, చిన్న చిన్న టీ కొట్లు, మొక్కజొన్న పొత్తుల వ్యాపారులు ఇప్పుడు కొనేవారు లేక ఖాళీగా కూర్చుంటున్నారు.
● అరకు ప్రత్యేకత అయిన వెదురు బొంగు చికెన్ విక్రయించే గిరిజన వ్యాపారులు, పర్యాటకులు అటువైపుగా రాకపోవడంతో తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.
● తిరుగు ప్రయాణాన్ని పాడేరు మీదుగా మళ్లించడం వల్ల ప్రయాణ సమయం కనీసం రెండు నుంచి మూడు గంటలు పెరుగుతుంది.ఇంధన ధరల దృష్ట్యా ఇది పర్యాటకుల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
● గంటల తరబడి అదనపు ప్రయాణం చేయడం వల్ల పర్యాటకులు అలసటకు గురవుతున్నారు. ఇది అరకు పర్యాటకం పట్ల ప్రతికూల భావన, భయాందోళనలను కలిగిస్తోంది. దీనివల్ల పర్యాటకుల రాక గతంలో కన్నా తగ్గిపోయింది.
● పర్యాటకం అంటే కేవలం సందర్శన మాత్రమే కాదు.. దీని వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. రద్దీ నియంత్రణ ఆంక్షల భయంతో పర్యాటకులు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల లాడ్జింగ్ రంగం తీవ్రంగా నష్టపోతోంది.
ప్రత్యామ్నాయాలు అవసరం
రద్దీని నియంత్రించడం అవసరమే, కానీ ట్రాఫిక్ అంక్షల నిర్ణయం పర్యాటక రంగ గొంతు నులిమేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అరకులోయ కేవలం ఒక విహార కేంద్రం మాత్రమే కాదు, వేలాది మంది గిరిజనుల ఉపాధి వనరు. పర్యాటకుల రద్దీ నెపంతో వారి పొట్ట కొట్టడం సరికాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రయోజనాలను కాపాడే విధంగా ట్రాఫిక్ నిబంధనలను సవరించి, పర్యాటకుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉంది.
అభివృద్ధి చేసిన కొత్తపల్లి జలపాత ముఖద్వారం
అరకులోయ అందాలనుఆస్వాదించాలని వచ్చే పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న ట్రాఫిక్ నిర్ణయం వల్ల స్థానిక పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎస్.కోట నుంచి అరకుకు వెళ్లే మార్గాన్ని వన్‌వేగా మార్చడం, తిరుగు ప్రయాణాన్ని పాడేరు మీదుగా మళ్లించడం.. పర్యాటకులకే కాకుండా, పర్యాటకంపైఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలకు శాపంగా మారింది. ప్రస్తుత ఆంక్షల వల్ల తిరుగు ప్రయాణంలో పర్యాటకులు అసలు అరకులోయలోకి ప్రవేశించే అవకాశమే లేకుండా పోయింది. భద్రత పేరుతో తీసుకున్నఈ నిర్ణయంతో పర్యాటకుల్లో భయాందోళన నెలకొంది. రద్దీని క్రమబద్ధీకరించడం అవసరమే అయినా, పర్యాటక రంగాన్ని కుదేలు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పాడేరు/అరకులోయ టౌన్ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేసింది. మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఎటువంటి ఆంక్షలు విధించకపోవడం వల్ల పర్యాటకులు భారీగా తరలివచ్చేవారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో మన్యం పర్యాటకాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయకపోగా ఆంక్షలు విధించి పర్యాటకులను ఇబ్బందులు పాల్జేస్తోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాన్ని రూ.కోటి నిధులు వెచ్చించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది.
చింతపల్లి మండలం చెరువులవెనం, కొయ్యూరు మండలం డౌనూరు ఘాట్‌లోని బోడకొండమ్మ ఆలయం వద్ద వ్యూపాయింట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఒకొక్కదానికి రూ.40 లక్షలు వెచ్చించింది.
చింతపల్లి మండలం తాజంగి వద్ద రూ.35కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమరయోథుల మ్యూజియం నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వంలో అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. వెచ్చించిన మొత్తం నిధుల్లో రాష్ట్రవాటా రూ.25 కోట్లు ఉన్నాయి. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని సందర్శిత ప్రాంతాలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.6.35 కోట్లతో అభివృద్ధి చేసింది. పర్యాటకులకు సౌకర్యవంతంగా చర్యలు చేపట్టింది.
గిరిజన మ్యూజియంలో గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ప్రతిమలు వెలిసిపోయినా అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రూ. 5 కోట్ల నిధులు కేటాయించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
చాపరాయి జలవిహారి వద్ద సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడేవారు. ఇక్కడ జలపాతంలో ఉన్న ఊబిలో చిక్కుకుని పర్యాటకులు ప్రమాదాలకు గురయ్యేవారు.హుద్‌హుద్ సమయంలో పద్మాపురం ఉద్యానవనంలో ట్రీహట్స్ శిథిలమైనా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.70 లక్షలతో చాపరాయి జలవిహారి, రూ.60 లక్షలతో పద్మాపురం ఉద్యానవనంలో కాటేజీలను నిర్మించింది.
డుంబ్రిగుడ మండలంలోని అంజోడ సిల్క్ ఫారం వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో రూ.1.02 కోట్లు వెచ్చించి అరకు పైనరీని నిర్మించింది. ఇలా అన్నివిధాలుగా పర్యాటక ప్రాంతాలను గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఆంక్షల పేరుతో పర్యాటకులను ఇబ్బందులు పెడుతోంది.
పర్యాటకంపై పిడుగు
పర్యాటకంపై పిడుగు
పర్యాటకంపై పిడుగు
పర్యాటకంపై పిడుగు
పర్యాటకంపై పిడుగు


