పండగ పూట.. పప్పన్నం లేనట్టే!
సాక్షి, పాడేరు: తమది పేదల ప్రభుత్వమని చెప్పుకునే సీఎం చంద్రబాబు వాస్తవంగా వారికి అన్యాయం చేస్తున్నారు. సంక్రాంతి పండగకు కందిపప్పు పంపిణీ చేయడంలో విఫలమవడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రేషన్‌కార్డులకు ప్రతి నెలా కందిపప్పు సరఫరాలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.
బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.120 నుంచి రూ.130 వరకు ఉంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ డిపోల ద్వారా సబ్సిడీపై కిలో రూ.70లకు అందించేవారు. కనీసం సంక్రాంతి పండగ పూట అయినా పప్నన్నం తినాలని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాల వారు భావిస్తారు. అయితే రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పు పంపిణీ కాని పరిస్థితి ఉంది. గత ఏడాది సంక్రాంతికి కూడా కందిపప్పు పంపిణీ చేయలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి నెలా సబ్సిడీపై కందిపప్పు పంపిణీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చేది. ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల దగ్గరే కందిపప్పును పొందేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో గిరిజనుల పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. కనీసం ఈ సంక్రాంతికై నా కందిపప్పు సరఫరా చేస్తారని పేదలంతా ఆశపడినప్పటికీ నిరాశే మిగులుతోంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు సంబంధించి మొత్తం 2,98,092 రేషన్‌కార్డుదారులున్నారు. వీరిలో 83శాతం రేషన్‌కార్డుదారులు గిరిజన కుటుంబాల వారే.ప్రతినెల సుమారు 290 టన్నుల వరకు కందిపప్పును పౌరసరఫరాలశాఖ సరఫరా చేయాల్సి ఉంది.పౌష్టికాహారం వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా రేషన్‌కార్డుపై ప్రతి నెలా ఇచ్చే కిలో కందిపప్పు విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.
సంతల్లో కిలో రూ.130
వారపు సంతల్లో కిలో కందిపప్పును రూ.130 కు అమ్ముతున్నారు. పాడేరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోని దుకాణాల వద్ద కిలో రూ.120కు విక్రయిస్తున్నారు. ఇంత అధిక ధరతో పేదప్రజలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
పండగ పూట.. పప్పన్నం లేనట్టే!


