పాత బంధుత్వాలు..
కొత్త బంధాలు..
● జోరా అంటూ ఆప్యాయంగా పలకరింపు
● ఆత్మీయతల వేదికగా తారుమారు సంత
● రూ. 2 కోట్ల వ్యాపారం.. వేల సంఖ్యలో జనం
● జి.మాడుగులలో కిక్కిరిసిన రోడ్లు
జి.మాడుగుల:
‘నేస్తం జోరా.. బాగున్నావా!‘ అంటూ ఆత్మీయ పలకరింపులు.. కొత్త దుస్తుల ముచ్చట్లు.. ఇప్పసార, జీలుగు కల్లు విందులు.. వెరసి జి.మాడుగుల మండల కేంద్రం ఆదివాసీల అనుబంధాల వేదికగా మారింది. జి.మాడుగుల సమీపంలోని వెంకటరాజు ఘాట్ వద్ద మంగళవారం జరిగిన సంప్రదాయ ’తారుమారు సంత’ (పండుగ సంత) గిరిజన సంస్కృతికి అద్దం పట్టింది.
రూ. 2 కోట్ల వ్యాపార లావాదేవీలు
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఈ సంతను నిర్వహించారు. అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల నుంచి భారీగా వ్యాపారులు తరలివచ్చారు.
●రాజ్‌మా, పసుపు, అల్లం, పిప్పలి, కొండచీపుర్లు వంటి అటవీ ఉత్పత్తులతో పాటు కోళ్లు, మేకల విక్రయాలు జోరుగా సాగాయి. ఉత్పత్తులను విక్రయించిన గిరిజనులు, ఆ సొమ్ముతో పండుగకు అవసరమైన నిత్యవసరాలు, కొత్త దుస్తులు కొనుగోలు చేశారు. ఈ ఒక్కరోజే సుమారు రూ. 2 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అంచనా.
బంధుత్వాల కలయిక
ఈ సంత కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒకరినొకరు కలుసుకున్నారు. ముఖ్యంగా తమ పిల్లలను పరస్పరం పరిచయం చేసుకుంటూ కొత్త బంధుత్వాల గురించి చర్చించుకున్నారు. యువకులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ ఆహ్వానాలు పంపుకున్నారు.
కిక్కిరిసిన రహదారులు
తారుమారు సంతకు సుమారు 25 వేల నుంచి 30 వేల మంది తరలిరావడంతో జి.మాడుగుల వీధులన్నీ జనసంద్రమయ్యాయి. దేవుని గెడ్డ నుంచి నుర్మతి జంక్షన్ వరకు రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎస్‌ఐ సాయిరాం పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
పాత బంధుత్వాలు..
పాత బంధుత్వాలు..


