లైంగిక దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు
పాడేరు : చిన్న పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత అన్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా.. ఆ తర్వాత కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడితే 20ఏళ్ల కఠిన కారగార శిక్ష నుంచి ఎవ్వరు తప్పించుకోలేరన్నారు. అనంతరం చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, వాటికి కారణాలు, పిల్లలకు కలిగే మానసిక ఒత్తిడి ఆన్‌లైన్ గ్రూమింగ్, వీడియో గేమ్స్, ట్రూమా, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ వల్ల కలిగే దీర్ఘకాలిక మానసిక అనారోగ్య సమస్యలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. సైకియాట్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టీఎన్‌ఎన్ రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్
డాక్టర్ హేమలత


