వైద్యవృత్తి అత్యున్నతమైనది
● కలెక్టర్ దినేష్‌కుమార్
● ఘనంగా పాడేరు వైద్య కళాశాల
వార్షికోత్సవం
సాక్షి,పాడేరు: వైద్యవృత్తి సమాజంలో అత్యున్నతమైనదని, మానవత్వంతో రోగులకు వైద్యం అందించే లక్ష్యంగా వైద్య విద్య పొందాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ సూచించారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవాన్ని గురువారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తోటి మనుషుల ప్రాణాలు కాపాడే అత్యంత పవిత్రమైన బాధ్యత వైద్యులపైనే ఉందన్నారు. కాబోయే వైద్యులంతా మానవీయ విలువలతో వైద్య వృత్తిని కొనసాగించాలన్నారు.రాష్ట్రంలో ఏకైక హిల్‌స్టేషన్ అయిన పాడేరులోని వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం అదృష్ణమన్నారు. ఒకప్పుడు మారుమూల గిరిజన ప్రాంతంగా గుర్తింపు పొందిన పాడేరులో వైద్య కళాశాల వస్తుందని, ఎవరూ ఊహించలేదని, ప్రభుత్వం దూరదృష్టితో ఏర్పాటు చేసిందన్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు సెకండ్ ఈయర్ నుంచి కమ్యూనిటీ మెడిషన్ ద్వారా నిరుపేద గిరిజనులకు వైద్యసేవ చేసే గొప్ప అవకాశం వచ్చిందన్నారు.ఆహ్లదకరమైన వాతావరణంలో వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. క్రీడా పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ఆయనను ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ డాక్టర్ డి.హేమలతాదేవి, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాపారత్నం, లక్ష్మీకుమారి, జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ తమర్బ నర్సింగరావు, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ సురేష్‌రెడ్డి,డాక్టర్ వెంకటేశ్వర్లు,డాక్టర్ శ్రీనివాస్,డాక్టర్ బి.శ్రీనివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ అప్పలనాయుడు పాల్గొన్నారు.


