ఏసీబీకి పట్టుబడిన ఎంఈవో
సాక్షి,పాడేరు: పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడి పెన్షన్ ఫైల్‌ను క్లియర్ చేసేందుకు రూ. 40 వేల లంచం డిమాండ్ చేసిన పాడేరు ఎంఈవో మోరి జాన్ గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాడేరులోని గొందూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు పి.రాములు ఇటీవల పదవీ విరమణ పొందారు. ఆయన పింఛన్ ప్రతిపాదనను విజయవాడలోని ఏజీ కార్యాలయానికి పంపేందుకు పాడేరు ఎంఈవో (ఎఫ్‌సీ) మోరి జాన్ రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. ఇందుకు నిరాకరించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం పాడేరు మండల పరిషత్ భవనంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి ఎంఈవో రూ.40వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంటనే అతనిని అరెస్టు చేశామని, ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. లంచం లేదా అవినీతికి సంబంధించి సమాచారం తెలిపేందుకు సంబంధిత జిల్లా ఏసీబీ అధికారులకు, టోల్‌ఫ్రీ నంబరు 1064, మొబైల్ నెంబర్ 9440440057లో సంప్రదించాలని ఆయన కోరారు. ఈ దాడులలో ఏసీబీ సీఐ లక్ష్మణరావు, సిబ్బంది శ్రీనివాసరావు, సుప్రియ, వెంకటరావు పాల్గొన్నారు. ఇలావుండగా ఎంఈవో కార్యాలయంతోపాటు ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
భారీగా ముడుపులిచ్చి..
పాడేరు ఎంఈవోగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే మోరి జాన్ పాఠశాలల తనిఖీలు, ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల విషయంలో లంచాలు డిమాండ్ చేస్తూ అవినీతి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాములు ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి, లంచం తీసుకుంటుండగా పట్టుకోవడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా ఉన్న ఈయన పాడేరులో అర్హులైన సీనియర్ హెచ్‌ఎంలు ఉన్నప్పటికీ పైరవీలు చేసి డిప్యుటేషన్‌పై ఇక్కడకు రావడం వెనుక భారీగానే సొమ్ము చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఈవో లంచం తీసుకుంటూ చిక్కడంతో విద్యాశాఖలో కలకలం రేగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అతని అక్రమాస్తులపై ఆరా తీస్తున్నారు.
పెన్షన్ ఫైల్ క్లియర్‌కు
రూ.40 వేల లంచం డిమాండ్
అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు
మోరి జాన్‌ను వలపన్ని పట్టివేత


