బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు
జి.మాడుగుల: ఉపాధి పనులు చేపట్టడం, చెల్లింపులు, విధుల పట్ల బాధ్యతగా పనిచేయకుంటే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ డీవీవీ విద్యాసాగర్ హెచ్చరించారు. స్థానిక ఉపాధిహామీ పథకం కార్యాలయ ఆవరణలో గురువారం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం 17వ సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పంచాయతీల్లో 2024 ఏప్రిల్ ఒకటి నుంచి 2025 మార్చి31వరకు చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ నివేదికలను ప్రజావేదికలో సమర్పించారు. మండలంలో 17 పంచాయతీల్లోని గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్, అటవీ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రూ.36,63,54,837లతో చేపట్టిన 3,709 పనులకు సంబంధించి సామాజిక తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన పనుల్లో 213కు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదని, కొన్ని చోట్ల మస్తర్లుపై సంతకాలు లేకుండా చెల్లింపులు జరిగినట్టు సభలో వెల్లడించారు. బెంచ్ టెర్రస్, ల్యాండ్ లెవెలింగ్, వర్క్‌షెడ్ పనుల కొలతల్లో తేడాలు, పనులు పూర్తయిన రశీదు ఇవ్వకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించినట్టు వెల్లడించారు. జాబ్ కార్డుల అప్డేషన్ లేకపోవడంపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ఆర్.వెంకటరావు, ఎంపీపీ లంబోరి అప్పలరాజు, ఎస్‌ఆర్వీలు అచ్యుత్, చిరంజీవి, ఏపీవో కొండబాబు, డిప్యూటీ ఎంపీడీవో, డీఆర్‌డీఏ పెన్షన్ పీవో,ఉపాధి హామీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి హామీ పీడీ విద్యాసాగర్ హెచ్చరిక


