పరామర్శకు వెళ్తుండగా..
సీలేరు వద్ద ఆటో, కారు ఢీ
ఆరుగురికి తీవ్ర గాయాలు
జెన్‌కో అంబులెన్సులో
ఆస్పత్రికి తరలింపు
కేసు నమోదు చేసిన పోలీసులు
సీలేరు: చావు ఇంటికి వెళ్లి పరామర్శిద్దామని బయలుదేరిన పదిమంది గిరిజనుల ప్రయాణం మార్గమధ్యలోనే ప్రమాదానికి గురైంది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, కారు బలంగా ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు. దుప్పులవాడ పంచాయతీ రష్యాగూడ గ్రామానికి చెందిన కొందరు గిరిజనులు, ఒడిశా సరిహద్దులోని రాసబెడ గ్రామంలో చావు ఇంటికి మంగళవారం ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో నర్సీపట్నంకు చెందిన ఒక కారు సీలేరు వైపు నుంచి వస్తోంది. ఇక్కడికి సమీపంలోని ఎర్రదెబ్బల వద్దకు వచ్చేసరికి ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమందిలో కుర్ర పొదలం, బురిడీ పద్మ, బురిడి మణిమ్మ, కుర్ర సువరణి, కిలో జ్యోతి, కిలో ముల్లమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఏపీ జెన్ కో సీఎస్సార్ అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యాధికారి అఖిల్ వారికి అత్యవసర చికిత్స అందించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరామర్శకు వెళ్తుండగా..
పరామర్శకు వెళ్తుండగా..


