భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ వైఎస్సార్‌సీపీదే
అరకులోయటౌన్: భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధిలో వైఎస్సార్‌సీపీ పాత్ర కీలకమని, ఆ క్రెడిట్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విమర్శలు చేశారని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీసీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి వ్యతిరేకించింది విమానాశ్రయ నిర్మాణాన్ని కాదని, విమానాశ్రయానికి 15వేల ఎకరాల భూసేకరణ చేయడాన్ని మాత్రమేనని చెప్పారు. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా సమయంలో విమానాశ్రయ నిర్మాణానికి 15వేల ఎకరాలు అవసరమన్నారని, రైతులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఐదు వేల ఎకరాలకు తగ్గించారని చెప్పారు. అది రైతుల పోరాట ఫలితమేనని చెప్పారు. నిబంధనలు పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎకరానికి రూ. 12.5 లక్షల పరిహారాన్ని ప్రకటిండంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. హైకోర్టులో కేసులు పరిష్కారం కాకుండా 2019 ఫిబ్రవరి 14న విమానాశ్రమ నిర్మాణానికి కొబ్బరకాయ కొట్టారని చెప్పారు. 2019–24 మధ్య జగనన్న పాలనలో నాలుగేళ్ల పాటు అన్ని అనుమతుల కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డంకులన్నీ అధిగమించి, అవసరమైన 2,751 ఎకరాల సేకరణ పూర్తి చేశారన్నారు. రెట్టింపు పరిహారం అందించి, రూ.80 కోట్లతో ఆధునిక కాలనీలు నిర్మించారని తెలిపారు. 2023 మే 3న అన్ని అనుమతులతో భూమి పూజ చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టును ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అభివృద్ధిని తమ పార్టీ ఎప్పుడు స్వాగతిస్తుందన్నారు. అవాస్తవ ఆరోపణలు చేయడం తప్ప వాస్తవాలను మార్చలేరని ఎమ్మెల్యే మత్స్యలింగం స్పష్టం చేశారు.


