‘త్రివిక్రముడి’గా అప్పన్న
సింహాచలం: సింహగిరిపై వైభవంగా జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ‘త్రివిక్రముడి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తి అయి న గోవిందరాజస్వామిని త్రివిక్రమ అవతారంలో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారు పల్లకిలో వేంజింపజేసి భక్తులను అనుగ్రహించారు. మరో పల్లకిలో ఆళ్వారులను ఉంచి ఆలయ మాడవీధుల్లో విశేషంగా తిరువీధి సేవ నిర్వహించారు. సాయంత్రం జరిగిన ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకుడు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


