అరకు టూరిజంపై ఆంక్షలు చేతకానితనమే..
● టీడీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే
ట్రాఫిక్ సమస్య
● అరకు రావొద్దని ఆంక్షలు విధించడం సరికాదు
● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ధ్వజం
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు అందాలు తిలకించేందుకు వచ్చే పర్యాటకులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో అరకు రావొద్దని ఆంక్షలు విధించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం విధించిన అంక్షల వల్ల పర్యాటకులు రానందున ఈ ప్రాంతం వెలవెలబోతోందన్నారు. దీనివల్ల పర్యాటక రంగంపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. సుంకరమెట్ట సమీపంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఉడెన్ బ్రిడ్జి వద్ద పార్కింగ్ స్థలం లేనందున ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించే వాహనాలకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందన్నారు. ఈ సమస్యను గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా మూడు రోజులు ఉడెన్ బ్రిడ్జి మూసివేయడాన్ని ఆయన గుర్తు చేశారు. అటవీశాఖ అధికారులు వలంటీర్లను పెట్టి ట్రాఫిక్ నియంత్రించాలని, లేకుంటే ఉడెన్ బ్రిడ్జి మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆంక్షల వల్ల టూరిజంపై ఆధారపడి బతుకుతున్న వేలాది గిరిజన కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, చిరు వ్యాపారులు, ఆదివాసీ నిరుద్యోగులు ఉపాధి కోల్పోతున్నారన్నారు.
ప్రకటనలకే పరిమితం
టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు ప్రకటనలకే పరిమితం అయిందని ఎమ్మెల్సీ రవిబాబు ఆరోపించారు. టూరిజం ఆర్గనైజేషన్ ట్రావెల్స్‌కు ప్రభుత్వ హెచ్చరికల వల్ల మోటార్ వాహనాలపై ఆధారపడిన వేలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉందన్నారు. గత వారం రోజులుగా అరకులోయలో హోటళ్లు వెలవెలబోతున్నాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పర్యాటకులను రావద్దని హెచ్చరిస్తున్నారన్నారు. ఇలాగైతే అరకు టూరిజంపై ప్రభావం చూపిస్తుందన్నారు.
ఊటీని మరపించిన అరకు
రాష్ట్రంలో నంబర్ వన్ హిల్‌స్టేషన్ అయిన అరకులో ఈ ఏడాది 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదై ఊటీని మరిపించేలా పర్యాటకులను ఆకర్షించిందని ఎమ్మెల్సీ రవిబాబు పేర్కొన్నారు. బొర్రాగుహలు, గిరిజన సంస్కృతి, జీవన శైలిని ప్రతిబింబించే గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, రణజిల్లెడ జలపాతం, అరకు పైనరీ, చాపరాయి జలవిహారి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన కాఫీ హౌస్, గిరిజన సాంస్కృతిక థింసా నృత్యాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్న వారంతా తీవ్ర నష్టపోతారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అరకు–విశాఖ ఘాట్ రోడ్‌లో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకొని, పర్యాటకులకు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని రవిబాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ రాష్ట ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు పాల్గొన్నారు.


