ఏజెన్సీ సంపద దోపిడీ
● ఆదివాసీ సంక్షేమ పరిషత్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను
ఎటపాక: ఏజెన్సీ ప్రాంతంలోని భూమి, నీరు అడవులు, ఖనిజ సంపద దోపిడీకు గురవుతున్నాయని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఆరోపించారు. ఆదివారం ఆయన మండలంలోని మండలం పట్టుచీర గ్రామంలో ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. చింతూరు డివిజన్‌లో అమాయక గిరిజనులను గిరిజనేతరులు మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల నుంచి తక్కువ రేట్లకే భూమి కౌలుకు తీసుకొని జామాయల్ తోటలు సాగు చేస్తున్నారని విమర్శించారు. గిరిజనుల భూములను గిరిజనేతరులకు కౌలుకు ఇవ్వరాదని అన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో నల్లరాయి, తెల్లరాయి, గ్రావెల్, ఇసుక, మైనింగ్‌లు చట్టవిరుద్ధంగా జరుగుతున్నాయన్నారు. వీటిపై సంబంధిత అధికారులు ముడుపులు తీసుకొని ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటపాక మండలం గుండాల క్వారీలో జరుగుతున్న అక్రమాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారులు పట్టించుకోడం లేదన్నారు. ఏజెన్సీ ప్రజలు ఈ అంశాలపై పోరాటానికి దిగాలని పిలుపు ఇచ్చారు. పాయం భాస్కర్, మడకం రాముడు, మడివి జోగయ్య, కోడి కృష్ణ, సత్యం, అంజి పాల్గొన్నారు.


