పాఠశాలలో పారిశుధ్య సమస్య పరిష్కరించాలి
సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి
నిర్వహణపై తీరుపై అసహనం
హెచ్‌ఎంకు బదిలీ, ఏటీడబ్ల్యూవోకు షోకాజ్ నోటీసుకు ఆదేశాలు
అడ్డతీగల: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. పాఠశాల తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాన్ని పరిశీలించారు. పాఠశాలలో కొరవడిన పారిశుధ్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు కనీసం తలుపులు లేకపోవడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. సెప్టిక్ నిండి వస్తున్న దుర్గంధంతో ఎదుర్కొంటున్న సమస్యను విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాఠశాల నిర్వహణపై నిర్లక్ష్యం తెలుస్తోందన్నారు. హెచ్‌ఎంను బదిలీ చేసి మరొకరిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో పారిశుధ్య సమస్యను వెంటనే యుద్దప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్వప్నకుమారి తదితరులు పాల్గొన్నారు.


