ప్రాణం ఉండగానే జీవశ్చవంలా!
పాడేరు ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిషేధం ఉన్నప్పటికీ, ముఠాలు సిండికేట్‌గా మారి మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తులపుట్టు సంత ఈ అక్రమ దందాకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతి గురువారం జరిగే ఈ సంతలో వ్యాపారులు తిష్టవేసి, గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారు. రూ. 20 వేల విలువైన పశువులను సగం ధరకే కొనుగోలు చేస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారు. ఒక్కో మినీ వ్యాన్‌లో 10కి పైగా పశువులను అత్యంత క్రూరంగా కుక్కి, పైకి లేవకుండా కట్టేసి రవాణా చేస్తున్నారు. వాటి దుస్థితి చూసి పెంచిన రైతులు సైతం కన్నీరు పెడుతున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాల వరకు అనేక చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, ఎక్కడా తనిఖీలు జరగకపోవడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే సుమారు రూ. 30 లక్షల విలువైన పశువుల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లోని కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు. తనిఖీలు లేని చెక్‌పోస్టులు, అధికారుల ఉదాసీనత కారణంగా ఏజెన్సీలో పశుసంపద కబేళాల పాలవుతోందని పశు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దర్‌ను వివరణ కోరగా కబేళాలకు పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై తగిన ఆదేశాలిస్తామని ఆయన పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు
ప్రాణం ఉండగానే జీవశ్చవంలా!


