మమతలు విరిసిన వేళ..
సాక్షి, పాడేరు: జిల్లా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గజగజ వణికించే చలిని, దట్టమైన పొగమంచును లెక్కచేయకుండా క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొండకోనల్లోని ప్రార్థనా మందిరాలు విద్యుత్ వెలుగులతో జిగేల్‌మన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి.
● ఏజెన్సీలోనే అత్యంత పురాతనమైన సుంకరమెట్ట చర్చితో పాటు, పాడేరులోని చారిత్రక సీబీఎం చర్చి భక్తులతో కిక్కిరిసిపోయాయి. బయట ఉష్ణోగ్రతలు పడిపోతున్నా, లోక రక్షకుని రాకను కొనియాడుతూ భక్తులు చేసిన ప్రార్థనలు ఆధ్యాత్మిక వెచ్చదనాన్ని పంచాయి. గురువారం ఉదయం పాస్టర్లు లోక కల్యాణార్థం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుక కేవలం కేక్ కటింగ్, విందులకే పరిమితం కాలేదు. పలు క్రైస్తవ కుటుంబాలు, పాస్టర్లు కలిసి పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టి క్రీస్తు బోధించిన ప్రేమను చాటుకున్నారు. తమ ఆనందాన్ని తోటివారితో పంచుకోవడమే నిజమైన క్రిస్మస్ అని నిరూపించారు.
● పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భవిష్యత్ వైద్యులు పండగను వినూత్నంగా జరుపుకున్నారు. విద్యార్థులు సొంతంగా రూపొందించిన క్రిస్మస్ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. చదువుతో పాటు సాటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండాలనే సందేశం అక్కడ ప్రతిధ్వనించింది. కొండ ప్రాంతాల్లో కురిసిన మంచు బిందువుల సాక్షిగా.. ఏజెన్సీ ప్రజలు శాంతి, సోదరభావంతో జరుపుకున్న ఈ క్రిస్మస్ వేడుకలు అందరిలో కొత్త ఆశలను నింపాయి.


