బస్తరు బేజారు
అది అడవి తల్లి ప్రసాదించిన ఎటువంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన సేంద్రియ పంట. కానీ, ఆ పంటను నమ్ముకున్న గిరిజన రైతుకు మాత్రం మిగిలేది కన్నీళ్లే. పెదబయలు ఏజెన్సీలో ప్రాణాలకుతెగించి సేకరిస్తున్న బస్తరు పిక్కల ధర అమాంతం పడిపోవడంతో గిరిజన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధర రూ. 300 నుంచి రూ. 80కి పడిపోవడం గిరి పుత్రుల ఆశలపై నీళ్లు చల్లింది
కిలో పిక్కల ధర రూ.300 నుంచి రూ.80కు పతనం
బొంగదారి గ్రామంలో సేకరించిన బస్తరు పిక్కలు వొలుస్తున్న ఓ కుటుంబం
పెదబయలు: ఏజెన్సీలో గిరిజన రైతులకు నవంబర్, డిసెంబర్ మాసాలు ఆదాయాన్ని ఇచ్చే కాలం. కొండ కోనల్లో సహజసిద్ధంగా పెరిగే బస్తరు పిక్కల సేకరణే వీరి ప్రధాన వృత్తి. ఎటువంటి రసాయనాలు లేకుండా పండే ఈ సేంద్రియ పంటకు మైదాన ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, గిరి రైతుకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధర అమాంతం పడిపోవడంతో గిరిజన కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి.
కష్టమెక్కువ.. ప్రతిఫలం తక్కువ! : బస్తరు పిక్కల సేకరణ సామాన్యమైన విషయం కాదు. నిటారుగా ఉండే కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తయిన చెట్లపైకి ఎక్కి వీటిని సేకరించాలి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు రోజంతా కష్టపడితే ఒక్కొక్కరు 5 నుంచి 7 కిలోల పిక్కలను మాత్రమే సేకరించి, ఒలవగలరు. ఇంత కష్టపడి మార్కెట్‌కు తీసుకెళ్తే, అక్కడ దళారుల దెబ్బకు రైతులు విలవిలలాడుతున్నారు.
● ధర కుప్పకూలడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల ప్రారంభంలో కిలో రూ. 300 పలికిన బస్తరు పిక్కల ధర, ప్రస్తుతం రూ. 80కు పడిపోయింది. మండల కేంద్రమైన పెదబయలు సంతలో కిలో రూ. 70 నుంచి రూ. 80 మాత్రమే ధర పలుకుతోంది. ఇక్కడ ధర లేదని ఆశతో పాడేరు వెళ్తే అక్కడ కూడా కిలో ధర రూ. 90కు మించడం లేదు. వచ్చిన ధర కాస్తా రవాణా ఖర్చులకే సరిపోతోందని, చేతికి చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు.
● ఇతర రాష్ట్రాల్లోనూ, మైదాన ప్రాంతాల్లోనూ ఈ బస్తరు పిక్కలకు కూరల్లో వాడకానికి విపరీతమైన గిరాకీ ఉంది. అక్కడ కిలో రూ. 300కు పైగా విక్రయిస్తున్నారు, అసలైన రైతుకు మాత్రం కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ఐటీడీఏ జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలకు తెగించి సేకరించినా
దక్కని ఫలితం
సంతల్లో తూనికల దగ్గర
జరుగుతున్న అన్యాయం
ప్రభుత్వం, ఐటీడీఏ జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్
మోసాలను అరికట్టాలి
గత నెలలో రూ. 300 ఉన్న ధర ఇప్పుడు రూ. 80కు పడిపోయింది. కుటుంబం అంతా కలిసి కొండల వెంబడి తిరిగినా కష్టానికి తగిన ఫలితం లేదు. సంతల్లో తూనికల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. రవాణా ఖర్చులు పోను కిలోకు రూ. 50 కూడా మిగలడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. – కిల్లో రాంబాబు, రైతు,
పందిగుంట, పెదబయలు మండలం
బస్తరు బేజారు


