సిండికేట్ సెగ
హుకుంపేట సంతలో ధరలు పతనంతో అడవిబిడ్డల ఆవేదన
హుకుంపేటలో గిరిజన ఉత్పత్తుల మార్కెట్
సాక్షి,పాడేరు: గిరిజన రైతులు కష్టపడి సాగు చేసిన వ్యవసాయ, వాణిజ్య పంటలకు వారపు సంతల్లో కనీస గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు పతనం చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కాఫీ, పిప్పలమోడి, రాజ్‌మా రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గిరిజనులు వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల అమ్మకాలకు వారపు సంతలకు తీసుకువస్తుంటారు. ఏజెన్సీలో గుర్తింపు పొందిన హుకుంపేట వారపు సంతలో శనివారం దళారి వ్యాపారులదే రాజ్యమైంది. ఇక్కడికి హుకుంపేట, పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, అరకులోయ మండలాలతోపాటు సరిహద్దులోని ఒడిశా గిరిజన రైతులు కాఫీ, రాజ్‌మా, పిప్పలమోడిని భారీగా తీసుకువచ్చారు. అయితే వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి గిట్టుబాటు ధర లేకుండా చేశారని గిరిజనులు వాపోయారు. వ్యాపారులంతా ఒకే ధర నిర్ణయించడంతో తీసుకువచ్చిన ఉత్పత్తులను తిరిగి ఇళ్లకు తీసుకువెళ్లలేక అమ్ముకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
● బెంగళూరు మార్కెట్‌లో పాచ్‌మెంట్ కాఫీ గింజలు కిలో రూ.500 ధర ఉంది. గిరిజన సహకార సంస్థ రూ.450 ధర ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సంస్థ వారపు సంతల్లో కొనుగోలు ఏర్పాటుచేయలేదు. దీంతో వారపు సంతలకు తీసుకువచ్చిన గిరిజనులు దళారి వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. వారు నిర్ణయించిన ధర కిలో రూ.320 అమ్మాల్సి వచ్చింది. ఒక్కరోజు సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరిగింది.
● పిప్పలమోడిని తీసుకువచ్చిన గిరిజన రైతులకు వ్యాపారుల సిండికేట్ దెబ్బ తప్పలేదు. గత సీజన్‌లో కిలో రూ.380కు కొనుగోలు చేసిన వ్యాపారులు శనివారం కిలో రూ.320కు మించి కొనుగోలు చేయలేదు. సుమారు రూ.30 లక్షల మేర వ్యాపారం జరిగింది.
● సంక్రాంతి పండగకు అదాయ వనరుగా గుర్తింపు పొందిన రాజ్‌మా గింజలకు కూడా ఈ సంతలో గిట్టుబాటు ధర కరువైంది. గత ఏడాది కిలో రూ.90 నుంచి రూ.100కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ఏడాది మాత్రం కిలో రూ.80కి మించి కొనడం లేదని గిరిజన రైతులు తెలిపారు. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉన్నందున కిలో రూ.110 వరకు ఉండవచ్చని ఆశించామని వారు తెలిపారు. సుమారు రూ.5 లక్షల మేర వ్యాపారం జరిగినా తమకు శ్రమ మాత్రమే మిగిలిందని వారు వాపోయారు.
రాజ్‌మా దెబ్బ.. దిగుబడి తగ్గి ధర పెరుగుతుందని ఆశించిన రైతులకు, గత ఏడాది కంటే తక్కువ ధర (రూ.80) ఇచ్చి వ్యాపారులు మోసం చేశారు.
జీసీసీ వైఫల్యం.. ధరలు ప్రకటించి, సంతల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది.
గతేడాది కన్నా తక్కువ ధర
పిప్పలమోడిని గత ఏడాది కన్నా తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేయడం అన్యాయం. గత సీజన్‌లో కిలో రూ.400కు అమ్ముకున్నా. శనివారం జరిగిన సంతలో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసినా వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధర పెరగకుండా చేశారు. వారు నిర్ణయించిన కిలో రూ.320కు అమ్ముకోవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర చెల్లించేలా ప్రభుత్వం ఆదుకోవాలి.
– గొల్లురి అప్పారావు, గిరిజన రైతు,
పనసపల్లి, పాడేరు మండలం
రూ.1950 నష్టపోయా
డబ్బు అవసరంతో హుకుంపేట సంతలో అమ్మేందుకు కాఫీ గింజలు తీసుకువచ్చా. వ్యాపారులంతా కిలో రూ.320కు కొనుగోలు చేశా రు. ధర తక్కువగా ఉన్నా ఇంటికి తీసుకువెళ్లలేక 15 కిలోలు రూ.4,800కు అమ్ముకోవాల్సి వచ్చింది. సంతలో జీసీసీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే కిలో రూ.450కు అమ్మడం వల్ల రూ.6,750 ఆదాయం వచ్చేది. దీనివల్ల రూ.1,950 నష్టపోయా.
– గుల్లెలి భవాని, కాఫీ రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలం
వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు కరువు
ధర పెరగకుండా కట్టడి చేస్తున్న
వ్యాపారులు
భారీగా ఆదాయం కోల్పోతున్న
గిరి రైతులు
భారీగా దోపిడీతో నష్టపోతున్నా
పట్టించుకోని జీసీసీ
సిండికేట్ సెగ
సిండికేట్ సెగ
సిండికేట్ సెగ
సిండికేట్ సెగ


