వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలు
జి.మాడుగుల: పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని డీఈవో రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గాంధీనగరంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యంశాలపై అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. గణితం,సైన్సు, ఇంగ్లీష్ సబ్జెక్టులపై విద్యార్థులను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు. తద్వారా వారి గ్రేడ్‌లను పరిశీలించారు.వంద రోజుల ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుల నుంచి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు బోధన ప్రణాళిక, పునఃశ్చరణ తరగతులు, ప్రత్యేక కోచింగ్‌పై ఆరా తీశారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న యూనిట్ టెస్టులు, వీక్లీ టెస్టులు, మాక్ పరీక్షల ఫలితాలను పరిశీలించారు. తక్కువ గ్రేడ్లలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యకశ్రద్ధ చూపాలని సూచించారు. అదనపు బోధన తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థి కనీస ఫలితాతు సాధించేలా వ్యక్తిగత శ్రద్ధ అవసరమని ఆయన పేర్కొన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, పరీక్షల దృష్ట్యా సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా, నిరంతర మూల్యాంకనంతో విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇవన్నీ అమలు చేస్తే పదో తరగతి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ బాబూరావుపడాల్, ఎంఈవో–2 వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.
డీఈవో రామకృష్ణారావు ఆదేశం


