ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీ..
రంపచోడవరం: నాడు వెన్నెముక విరిగి మంచాన పడిన వ్యక్తి, నేడు తన కాళ్ల మీద తాను నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు.. ఒక సంక్షేమ పథకం ఒక నిండు ప్రాణాన్ని, ఒక నిరుపేద కుటుంబాన్ని ఎలా కాపాడిందో చెప్పే సజీవ సాక్ష్యం!.‘నేను ఈరోజు ఇలా బతికి ఉండి, నాలుగు మెతుకులు తినగలుగుతున్నానంటే అది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమే..‘ అంటూ ఉద్వేగంతో నిండిన కళ్లతో చెబుతున్నారు ఐ.పోలవరం గ్రామానికి చెందిన మడకం శ్రీనివాసదొర. ఒక సామాన్య గిరిజన కుటుంబం విధి ఆడిన వింత నాటకంలో కుప్పకూలిపోయే స్థితి నుంచి, నేడు ఆత్మగౌరవంతో బతుకుతున్నానని ఆనందంతో తెలిపారు.
మృత్యువు అంచున శ్రీనివాసదొర..
2019కు ముందు జరిగిన ఒక దురదృష్టకర ఘర్షణలో శ్రీనివాసదొర తీవ్రంగా గాయపడ్డారు. రంపచోడవరం నుంచి రాజమహేంద్రవరం.. అక్కడి నుంచి కాకినాడ.. ఆసుపత్రులు మారినా ఆందోళన మాత్రం తగ్గలేదు. ‘వెన్నెముక పూర్తిగా దెబ్బతింది‘ అని వైద్యులు చెప్పిన మాటలు ఆ కుటుంబంపై పిడుగులా పడ్డాయి. ఇక నడవలేడు, బతకలేడు అనుకున్న తరుణంలో ’డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ అండగా నిలిచింది.
పునర్జన్మ నిచ్చిన ఉచిత వైద్యం
నెలరోజుల పాటు అత్యుత్తమ వైద్యం, ఆపరేషన్లు అన్నీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందాయి. కేవలం ప్రాణాలు కాపాడటమే కాదు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో చేతిలో రూ. 30 వేలు పెట్టి సురక్షితంగా ఇంటికి పంపింది నాటి ప్రభుత్వం.
ఆర్థిక ఆసరా.. ఆత్మగౌరవ జీవనం
వైద్యం అంది ప్రాణం నిలిచినా, ఇంటికి వచ్చాక ‘ఎలా బతకాలి?‘ అన్న ప్రశ్న వేధించింది. ఆ సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏకంగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆ సొమ్ముతో శ్రీనివాసదొర తన గ్రామంలోని ఐ.పోలవరం జంక్షన్‌లో ఒక చిన్న కిళ్లీ షాపును ఏర్పాటు చేసుకున్నారు. ‘నా భర్తకు ప్రాణదానం చేయడమే కాకుండా, మా కుటుంబం రోడ్డున పడకుండా రూ. 5 లక్షల సాయం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును జన్మలో మర్చిపోలేం‘ అని శ్రీనివాసదొర భార్య విజయలక్ష్మి కృతజ్ఞతగా చెబుతున్నారు.


