
రోడ్డు ప్రమాదంలో విశాఖవాసి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
గజపతినగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్ (మెంటాడ జంక్షన్) వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గజపతినగరం ఎస్సై కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన మెరుగు బాలాజీ (25), అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన కోటపర్తి లక్ష్మణరావు ద్విచక్ర వాహనంపై మధురవాడ నుంచి అనంతగిరి మండలం మూలవలసకు బయలుదేరారు. గజపతినగరం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న బొగ్గు లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న కోటపర్తి లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న బాలాజీ లారీ చక్రం కింద ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే క్షతగాత్రుడ్ని స్థానికులు గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ చోటేలాల్ (మధ్యప్రదేశ్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, క్షతగాత్రుడు మధురవాడలో ప్లంబింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.