చంద్రబాబు చేలో మేస్తే.. ఈయన గట్టున మేస్తాడా?

- - Sakshi

తప్పుడు సర్వేలతో ముదపాక భూముల వ్యవహారంలో బండారు.. మోసపూరిత విధానంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ ‘స్కిల్‌’ కనబరిచారు. ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలు చేయని తన సతీమణి పేరుతో ఏకంగా రూ.92 లక్షలకుపైగా నగదుతో గంటా భీమిలిలో కొనుగోలు చేసిన భూ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా భారీ నగదుతో జరిపిన లావాదేవీల్లో పేర్కొన్న పాన్‌ నంబర్‌ కూడా తేడాగా ఉండటం గమనార్హం.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:వు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! అన్న చందంగా.. తెలుగుదేశం పార్టీ నేతలు తమ నాయకుడి తరహాలోనే కనికట్టు చేయడంలో ఆరితేరిపోయారు. ఒకవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో బోగస్‌ కంపెనీలతో కోట్లు కొట్టేసి జైలులో చంద్రబాబు ఉన్నారు. తాను తక్కువేమీ కాదన్నట్టు... భీమిలిలో తన సతీమణి పేరు మీద కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో గంటా కూడా అదే తరహా ‘స్కిల్‌’ కనబరిచారు. ఆదాయపన్నుశాఖ నిబంధనలకు విరుద్ధంగా కేవలం నగదు రూపంలో రూ.92 లక్షలకుపైగా చెల్లింపులు ఆయన సతీమణి పేరు మీద చేసినట్టు లెక్కల్లో చూపారు.

అయితే, ఆమె తరపున ఐటీ రిటర్న్స్‌ను ఎక్కడా దాఖలు చేయకపోవడం గమనార్హం. గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే... భీమిలి ప్రాంతంలో 1,936 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందంలో గంటా వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

అంతా నగదు రూపంలోనే...!
ఆదాయపన్నుశాఖ చట్ట ప్రకారం రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేపట్టరాదు. ఈ నిబంధనలేవీ తెలియని వ్యక్తి కాదు గంటా శ్రీనివాసరావు. అయితే తన సతీమణి పేరుతో 2018లో భూముల కోనుగోలులో నగదు రూపంలోనే మెజార్టీ వ్యవహారం నడవడం విమర్శలపాలవుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ విధంగా జరగడం బహుశా యాదృచ్ఛికం కాకపోవచ్చు. రూ.92.98 లక్షలు కేవలం నగదు రూపంలో ఇచ్చినట్టు చూపారు. మరో రూ. 25 లక్షలను ఆర్‌టీజీఎస్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసినట్టు చూపి.. సర్వే నెంబరు.. టీఎస్‌ నెంబరు 1490, బ్లాక్‌ నెంబరు 17, వార్డు నెంబరు 24లోని 1936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఒకవేళ ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్‌నెంబరు పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఒకవైపు తన అఫిడవిట్‌లో గంటా శారద 2014–15 నుంచి 2018–19 మధ్య ఒక్కసారి కూడా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసినట్లు చూపించలేదు. మరోవైపు గంటా శ్రీనివాసరావు మాత్రం 2014–15 నుంచి ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసినప్పటికీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,39,338 ఆదాయంగా చూపడం గమనార్హం. ఆదాయపన్నుశాఖ సెక్షన్‌ 271 డి ప్రకారం... రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలను నిర్వహిస్తే శిక్షార్హుడు అవుతారు. ఆదాయపన్నుశాఖ సెక్షన్‌ 269 ఎస్‌టీ ప్రకారం అంతే మొత్తాన్ని పెనాల్టీ రూపంలో వసూలు చేసే అధికారం ఉంది.

రెండు పాన్‌కార్డులు ఉండొచ్చా..!
భీమిలిలో భూములు కొనుగోలు చేసిన సందర్భంలో ఆయన సతీమణి పేరు మీద పేర్కొన్న పాన్‌కార్డు నెంబరు ఏబీపీపీజీ2216ఏ. అయితే, ఆయన అఫిడవిట్‌లో మాత్రం తన సతీమణి పాన్‌ నెంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. వాస్తవానికి ఐటీశాఖ నిబంధనల ప్రకారం రెండు పాన్‌కార్డు నెంబర్లను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం.

రెండు పాన్‌కార్డులు ఏ సమయంలో ఉంటాయంటే... 
► 
అప్పటికే ఉన్న పాన్‌కార్డులో ఏవైనా తప్పులు ఉంటే... వాటిని సరిచేసుకోకుండా కొత్త దానికి దరఖాస్తు చేయడం.

పాన్‌కార్డు కోసం పలుమార్లు దరఖాస్తు చేయడం  

పెళ్లికి ముందు ఒక పాన్‌కార్డు... పెళ్లి తర్వాత మరో పాన్‌కార్డుకు మహిళలు దరఖాస్తు చేసిన సమయంలో...

ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో అక్రమంగా రెండు పాన్‌కార్డులను కలిగి ఉండటం.

ఇందులో ఏదైనా చట్టరీత్యా నేరమే. తమకు ఉన్న రెండు పాన్‌కార్డులను వెంటనే తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆదాయపన్నుశాఖ చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవహారంలో నిజంగా రెండు పాన్‌కార్డులు ఉన్నాయా? ఒకే సిరీస్‌లో కేవలం నెంబరు మార్చి తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిచిందా? అనేది లోతుగా విచారిస్తే మినహా తెలిసే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదీ ఏమైనా తెలుగుదేశం నేతలు అవినీతి వ్యవహారంలో చూపుతున్న ‘స్కిల్‌’ మాత్రం కొంగొత్త పుంతలు తొక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top