ఆదిలాబాద్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇన్‌చార్జి డివిజనల్ మేనేజర్ (హార్టికల్చర్) గుడిమల్ల సందీప్ కుమార్‌ను విధుల నుంచి తొలగించి, శాఖాపరమైన విచారణతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సి ఉండగా, టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని వస్తువులను ప్రొసీడింగ్స్‌లో చేర్చారని ఆరోపించారు. నాలుగు జిల్లాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సదరు అధికారి టెండర్ ప్రొసీడింగ్స్‌ను స్వయంగా సిద్ధం చేసి, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి సంతకాలు తీసుకున్నారన్నారు. టెండర్‌లో లేని నాణ్యతలేని కారం పొడి వంటి వస్తువులను ప్రైవేటు కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క సరఫరా చేస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వెట్టి మనోజ్, అర్క శేషరావు పాల్గొన్నారు.


