ఆదిలాబాద్‌టౌన్: ఎట్టకేలకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. టీచర్ల కొరతతో కొన్ని పాఠశాలల్లో ఇబ్బందులు తలెత్తాయి. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ గతనెలలోనే సర్దుబాటు చేపట్టాలని ఆదేశించినప్పటికీ ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి సర్దుబాటు ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు కేటాయించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉన్న బడులకు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు కేటాయించారు. మొత్తం 55 మంది ఉపాధ్యాయులకు సర్దుబాటు చేపట్టారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు ఉన్నారు. అయితే ఆయా మండలాల పరిధిలో అవసరం ఉన్న ఉపాధ్యాయులు 34 మందిని సర్దుబాటు చేయగా, ఇతర మండలాలకు, పక్క మండలాలకు 21 మందిని సర్దుబాటు చేశారు. సంబంధిత మండలాల విద్యాధికారులకు వీటికి సంబంధించిన జాబితాను పంపించారు. అయితే కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అవసరం ఉన్నప్పటికీ కేటాయించకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేటట్టు కానరావడం లేదు. కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఇటీవల విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు చూపించి ఆ పోస్టును వదలకుండా చూస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఈ ప్రక్రియ ద్వారా అవసరం ఉన్న పాఠశాలలకు టీచర్లను కేటాయించడంతో విద్యార్థులకు మేలు జరగనుంది. గతేడాది దాదాపు 200 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. వారు ప్రస్తుతం అదే పాఠశాలల్లో కొనసాగుతుండగా, కొంతమంది వారు పనిచేసే పాఠశాలలకు వెళ్లిపోయారు.
నేటి నుంచి కేటాయించిన స్థానాల్లో..
సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులకు కేటాయించిన పాఠశాలల్లో విధులు నిర్వహించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వెళ్లకపోతే శాఖపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి సంబంధిత పాఠశాలలకు వెళ్లి విద్యాబోధన చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 3066 పోస్టులు ఉండగా, 2602 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 464 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు విద్యాశాఖ కార్యాలయంలో కొందరు ఫారెన్ సర్వీస్, మరికొందరు డిప్యూటేషన్‌లో పనిచేస్తున్నారు. డైట్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లను నియమించకపోవడంతో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ విధులు కేటాయించారు. ఏఎంఓ పోస్టుతో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ ఏఎంఓలు డిప్యూటేషన్‌పై ఉన్నారు. గతంలో ఈ పోస్టులో ఒక్కరే పనిచేస్తుండగా, అదనంగా అసిస్టెంట్ ఏఎంఓలను నియమించడంపై పలువురు ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబోధన కోసం కేటాయించిన ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయంలో సిబ్బందిగా విధులు నిర్వహించడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జిల్లా విద్యా శాఖాధికారి మాధవిని వివరణ కోరగా, జిల్లాలో 55 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు తెలిపారు. గతేడాది సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులు యధావిధిగా పనిచేస్తున్నారన్నారు. పాఠశాలల అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం జరిగిందని వివరించారు.


