పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల రేట్లు అన్నదాతపై రూ.75 కోట్ల భారం రవాణా చార్జీలు రైతుపై మోపుతున్న డీలర్లు మరింత భారం కానున్న సాగు
(రూ.ల్లో) (రూ.ల్లో)
బోథ్:పెరిగిన ఎరువుల ధరలతో జిల్లా రైతాంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా ఎరువుల కంపె నీలు ధరలు విపరీతంగా పెంచాయి. కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పీ (సింగిల్ సూపర్ ఫాస్ఫేట్), ఎంవోపీ (మ్యూరేటాఫ్ పొటాష్) ఎరువులలో రకాన్ని బట్టి ధరలు పెరిగిపోయాయి. నాలుగేళ్లలోనే ఐదుసార్లు ధరలు పెరగ్గా, తాజా పెంపుతో కొన్ని రకాల ఎరువుల ధరలు ఏకంగా రెట్టింపయ్యా యి. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ఎరువుల ధరలు పెరగడంతో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంప్లెక్స్ ధరలు ౖపైపెకి..
కేంద్ర ప్రభుత్వం డై అమోనియా ఫాస్ఫేట్ (డీఏపీ) సరఫరా, రాయితీలను పెంచడం వల్ల దాని ధరలో ప్రస్తుతానికి మార్పు రాలేదు. ప్రస్తుతం జిల్లా మార్కెట్‌లో డీఏపీ బస్తా రూ.1,350 నుంచి రూ.1,450కే లభిస్తున్నప్పటికీ, మిగిలిన ఎరువుల ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అయినప్పటికీ పత్తి, సోయాబీన్ వంటి పంటల దిగుబడి కోసం దుక్కిలోనే వేయాల్సిన కాంప్లెక్స్ ఎరువులను రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో దాదాపు 5,45,643 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. తాజా ధరల పెరుగుదలతో జిల్లా రైతాంగంపై ఏడాదికి రూ.75 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడనుంది.
రైతుపైనే రవాణా చార్జీల భారం
ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం జిల్లాలో ఎరువుల సరఫరాపై మరింత ప్రభావం చూపనుంది. మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా రేక్ పాయింట్ల నుంచి విక్రయ కేంద్రాలకు అందించే ఎఫ్‌ఓఎల్ (ఫ్రైట్ ఆన్ లారీ) రవాణా రాయితీని నిలిపివేస్తూ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ప్రైవేటు డీలర్లు, ప్యాక్స్, డీపీఎంఎస్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాలు, హాకా, ఎఫ్‌పీవోలు రేక్ పాయింట్ల నుంచి రవాణా ఖర్చులను సొంతంగా భరించాల్సి వస్తుంది. రేక్ పాయింట్ల నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని మండలాలు, ఇతర గ్రామాలకు ఎరువులను తరలించడానికి బస్తాకు రూ.20 నుంచి రూ.40 వరకు అదనపు ఖర్చు అవుతుంది. ఈ రవాణా భారాన్ని కూడా వ్యాపారులు చివరకు జిల్లా రైతులపైనే మోపుతున్నారు.
యూరియా అతివాడకంతో దెబ్బతింటున్న భూసారం
కాంప్లెక్స్ ఎరువుల ధరలు భరించలేక, పంటలకు విచ్చలవిడిగా యూరియాను వాడటం వల్ల భూసారం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి యూరియా వాడితే తాత్కాలికంగా పంట పచ్చగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో నేలసారం తీవ్రంగా క్షీణించి దిగుబడులు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎరువులు పాతధర కొత్తధర పెరుగుదల
20–20–0–13 1,500 2,150 650
10–26–26 1,950 2,450 500
16–16–16 1,675 2,050 375
24–24–0 2,000 2,300 300
12–32–16 1,900 2,450 550
14–35–14 1,350 1,900 550
ఎంవోపీ 1,850 1,975 125
పెరిగిన ఎరువుల ధరలు ఇలా..


