కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’ | Sakshi
Sakshi News home page

కొయ్యబొమ్మకు ‘మోదీ గ్యారంటీ’

Published Mon, Nov 27 2023 12:16 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌/నిర్మల్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను చిత్తుగా ఓడించా లని, బీజేపీని గెలిపించాలని బీజేపీ ఆది లాబాద్‌ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ కోరారు. వారం రోజులుగా ఆదిలాబాద్‌లో బీజేపీ పుంజుకుంటోందన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో వణుకు మొదలైందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని, బీసీని ముఖ్యమంత్రి చేసే బీజేపీని గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండే తోడుదొంగలన్నారు. నిజాయతీపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవాలన్నారు.

"నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనాలు. బాసర సరస్వతీమాత చరణాలకు నా ప్రణామం. ఈ గడ్డపై పుట్టిన ఆదివాసీయోధులు కుమురంభీమ్‌, రాంజీగోండుకు నా నివాళులు. తన పోరాటంతో రాంజీ గోండు యువతకు ప్రేరణగా నిలిచారు.." అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ రోడ్డులో పాతక్రషర్‌ ఎదురుగా ఆదివారం నిర్వహించిన సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని పాల్గొన్నారు.

నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్‌, రమేశ్‌రాథోడ్‌, పాయల్‌ శంకర్‌, సోయం బాపూరావు తరఫున నిర్వహించిన ఈ ఎన్నికలసభకు భారీగా జనం తరలివచ్చారు. సభాప్రాంగణం నుంచి కనుచూపు మేరంతా జనసంద్రమే కనిపిస్తోందని, కాంగ్రెస్‌ సుల్తానులు, బీఆర్‌ఎస్‌ నిజాంలు ఒక్కసారి వచ్చి చూస్తే.. రాంజీగోండు ప్రేరణ, బీజేపీ గెలుపు ఖాయమన్న విషయం తెలుస్తుందని మోదీ అన్నారు.

తమకు తాము రాజకీయ తీస్మార్‌ఖాన్‌ అనుకుంటున్నారో, రాజనీతి జ్ఞానిగా భావిస్తున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కేసీఆర్‌ ఎప్పుడో కారు స్టీరింగ్‌ వేరేవాళ్లకు అప్పగించి ఫామ్‌హౌస్‌కు వెళ్లి పడుకుంటున్నాడన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ప్రశ్నించారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని మోదీ చెప్పారు.

కొయ్యబొమ్మకు గ్యారంటీ..
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు మేడిన్‌ ఇండియా అన్న, మేకిన్‌ ఇండియా అన్న ఇష్టం ఉండదని ప్రధాని ఆరోపించారు. ఈ కారణంగానే ఘనమైన చరిత్ర కలిగిన నిర్మల్‌ కొయ్యబొమ్మల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మల్‌ కొయ్యబొమ్మలకు పూర్వవైభవం తీసుకువస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు.

నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జాతీయ పసుపుబోర్డుతో నిర్మల్‌ జిల్లా రైతులకూ మేలు కలుగుతుందన్నారు. ఇక్కడి పసుపురైతులు పండించే పసుపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోందని తెలిపారు. కోవిడ్‌ తర్వాత పసుపు విలువ ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. వరి రైతులకు మద్దతుగా ధాన్యం క్వింటాల్‌కు రూ.3,100 చెల్లిస్తామని ప్రకటించామన్నారు.

తెలుగులో మాట్లాడుతూ..
ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించడంతోపాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. అసలు ప్రధానమంత్రి ఇంతా బాగా తెలుగు మాట్లాడగలరా.. అనేలా భాషను ఉచ్చరించారు. ‘మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..’ అని అనడంతో సభలో విశేష స్పందన వచ్చింది. ‘ప్రజలను కలవని, సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా..’ అంటూ తెలుగులోనే ప్రశ్నించారు. ‘మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యేది..’ అని చెప్పడం, ప్రతీసారి ‘నా కుటుంబసభ్యులారా..’ అని సంబోధించడం సభికులను ఆకట్టుకుంది. సభ ఆద్యంతం ‘మోదీ.. మోదీ..’ అన్న నినాదాలతో సభాప్రాంగణం మార్మోగింది.

ఎంపీ సోయం గైర్హాజరు..
ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభకు ఆదిలా బాద్‌ ఎంపీ, బీజేపీ బోథ్‌ నియోజకవర్గ అభ్యర్థి సోయం బాపురావు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ఏ కారణాల వల్ల రాలేదనేది తెలియరాలేదు. ఇది చర్చనీ యాంశమైంది. మరోవైపు పార్లమెంట్‌ పరిధిలో ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు.

నిర్మల్‌, ముధోల్‌, ఖా నాపూర్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్‌, రమేశ్‌ రాథోడ్‌, పాయ ల్‌ శంకర్‌, అజ్మీరా ఆత్మారాంనాయక్‌ హాజరయ్యారు. అలాగే బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు, ఉమ్మడి ఆదిలాబా ద్‌ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, మాజీ మంత్రి అమర్‌సింగ్‌తిలావత్‌, మాజీ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్‌, తదితరులంతా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: '30వ తేదీన ఏముంది?' అంద‌రికీ గుర్తుండేలా ‘స్వీప్‌’ హోర్డింగ్‌లు!

Advertisement
 
Advertisement