విప్ ధిక్కరణ పిటిషన్ తిరస్కరణ
సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన ఏడుగురు కౌన్సిలర్లు విప్ ధిక్కరించారంటూ మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లు సూర్యాపేట ఆర్డీఓ బి.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
ఆధారాలు లేవని ప్రకటించిన ఆర్డీఓ
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన ఏడుగురు కౌన్సిలర్లు విప్ ధిక్కరించారంటూ మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లు సూర్యాపేట ఆర్డీఓ బి.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడుగురు కౌన్సిలర్లు విప్ ఉల్లంఘించినట్లు విచారణలో తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ నెల 6న విచారణ నిర్వహించామని, ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని పేర్కొన్నారు.
విచారణలో కౌన్సిలర్ల ఇళ్లకు విప్ పత్రం అతికించినట్లు తెలిపినా ఏ ఇంటికి అతికించారో చుట్టుపక్కల వారితో పంచనామా చేసినట్లు ఆధారాలు చూపలేదన్నారు. అదే విధంగా విప్‌లో చైర్మన్ అభ్యర్థిగా ఎవరికి ఓటు వేయాలో పేర్కొనకపోవడంతో అయోమయంతో తాము చేతులెత్తలేదని కౌన్సిలర్లు పేర్కొన్నారని ఆర్డీఓ తెలిపారు. దీంతో ఫిర్యాదు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేస్తానని వివరించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ : కాంగ్రెస్
సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నికలో విప్ ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన ఫిర్యాదును ఆర్డీవో తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆ పార్టీ నాయకులు గుడిపాటి నర్సయ్య, బైరు వెంకన్నగౌడ్, మడిపల్లి విక్రమ్‌లు ఆరోపించారు. సోమవారం విప్ ఉల్లంఘన ఫిర్యాదును తిరస్కరించినట్లు ఆర్డీఓ ప్రకటించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఆర్డీఓ డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. మంత్రి చెప్పినట్లే చేశారని ఆరోపించారు. ఆర్డీఓ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓకు వ్యతిరేకంగా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.


