breaking news
Suryapet Municipality
-
కుమారుడి యాదిలో.. ప్రజా సేవలోకి
సూర్యాపేటటౌన్ : తన కుమారుడు కల్నల్ సంతోష్‌బాబు దేశ సేవలో ప్రాణాలర్పించాడని, కుమారుడి జ్ఞాపకాలతో ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని సూర్యాపేట మున్సిపాలిటీలో 44వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని సంతోష్‌బాబు తల్లి బిక్కుమళ్ల మంజుల తెలిపారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..2020లో గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో నా కుమారుడు కల్నల్ సంతోష్‌బాబు వీర మరణం పొందాడు. అలాంటి మహానుభావుడి తల్లినైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుమారుడు మృతిచెందిన సమయంలో అప్పటి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి మా కుటుంబానికి ఎంతో అండగా నిలిచారు. కేసీఆర్‌పై ఉన్న మమకారం, ఆయన చేసిన గొప్ప అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై బీఆర్ఎస్ నుంచి 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. గెలుస్తాననే నమ్మకం ఉంది..ప్రస్తుతం ప్రచారం సైతం నిర్వహిస్తున్నాను. వార్డులో నాకు మంచి స్పందన వస్తుంది. నేను తప్పకుండా గెలుస్తానని వార్డు ప్రజలు చెబుతున్నారు. నాకు బీఆర్ఎస్ నుంచి పూర్తి సహకారం ఉంది. అదేవిధంగా నా భర్త ఉపేందర్‌తో పాటు కుటుంబ సభ్యులు సైతం పోటీ చేసేందుకు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కౌన్సిలర్‌గా గెలిపిస్తే 44వ వార్డులో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తా. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
సూర్యాపేట మున్సిపాలిటీ గరుడ బస్సుల్లో తిరుగుతూ ప్రయాణికుల సూట్‌కేసులు, బ్యాగుల్లో ఉన్న విలువైన వస్తువులను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ ఇన్స్పెక్టర్ వై.మొగలయ్య పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠా వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని హైటెక్ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా బ్యాగుల్లో 20 తులాల బంగారు ఆభరణాలు, వేయింగ్ మిషన్ లభించినట్లు తెలిపారు. వీరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండీ ఇర్ఫాన్ అలియాస్ బాయ్, ఎండీ హనీస్లు హైదరాబాద్ కేంద్రంగా ముఠాగా ఏర్పడ్డారన్నారు. వీరు హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు వెళ్లే గరుడ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే సమయంలో గత వారం క్రితం ఐదుగురిని పట్టుకోగా వారిలో ముగ్గురు ఎండీ.ఇర్ఫాన్, మక్సూద్ అహ్మద్, అహ్మద్ హసన్‌లు పట్టుబడగా వీరిద్దరు పరారీ అయ్యారు. కాగా ఈ ఇద్దరు బుధవారం జైలులో ఉన్న ముగ్గురిని కలిసి వెళ్లేందుకు వచ్చి పట్టుబడినట్లు వివరించారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్ఐలు ఎంఏ జబ్బార్, ఎ.శ్రీనివాస్, ఐడీ పార్టీ సిబ్బంది గొర్ల కృష్ణ, గోదేశి కరుణాకర్, చనగాని వెంకన్నగౌడ్, కరణం అరవింద్, సంగి నరేందర్, ఎల్లారెడ్డి, దైద రాజు, జి.కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
విప్ ధిక్కరణ పిటిషన్ తిరస్కరణ
ఆధారాలు లేవని ప్రకటించిన ఆర్డీఓ సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన ఏడుగురు కౌన్సిలర్లు విప్ ధిక్కరించారంటూ మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించినట్లు సూర్యాపేట ఆర్డీఓ బి.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడుగురు కౌన్సిలర్లు విప్ ఉల్లంఘించినట్లు విచారణలో తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ నెల 6న విచారణ నిర్వహించామని, ఇరువర్గాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని పేర్కొన్నారు. విచారణలో కౌన్సిలర్ల ఇళ్లకు విప్ పత్రం అతికించినట్లు తెలిపినా ఏ ఇంటికి అతికించారో చుట్టుపక్కల వారితో పంచనామా చేసినట్లు ఆధారాలు చూపలేదన్నారు. అదే విధంగా విప్లో చైర్మన్ అభ్యర్థిగా ఎవరికి ఓటు వేయాలో పేర్కొనకపోవడంతో అయోమయంతో తాము చేతులెత్తలేదని కౌన్సిలర్లు పేర్కొన్నారని ఆర్డీఓ తెలిపారు. దీంతో ఫిర్యాదు తిరస్కరించినట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేస్తానని వివరించారు. ప్రజాస్వామ్యం ఖూనీ : కాంగ్రెస్ సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నికలో విప్ ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన ఫిర్యాదును ఆర్డీవో తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆ పార్టీ నాయకులు గుడిపాటి నర్సయ్య, బైరు వెంకన్నగౌడ్, మడిపల్లి విక్రమ్‌లు ఆరోపించారు. సోమవారం విప్ ఉల్లంఘన ఫిర్యాదును తిరస్కరించినట్లు ఆర్డీఓ ప్రకటించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఆర్డీఓ డబ్బుకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. మంత్రి చెప్పినట్లే చేశారని ఆరోపించారు. ఆర్డీఓ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఆర్డీఓకు వ్యతిరేకంగా కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.


