సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతమైంది. ప్రజల సమస్యలను వారి మండల స్థాయిలోనే నేరుగా స్వీకరించి, వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
రాష్ట్రంలోని మొత్తం 565 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మండల స్థాయి ప్రజావాణి నిర్వహించగా, సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించినట్లయిందని ప్రజావాణి రాష్ట్ర ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ తెలిపారు.
5,410 వినతుల స్వీకరణ
మండల స్థాయి ప్రజావాణికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మొత్తం 5,410 వినతులు (పిటిషన్లు) అందాయి. ప్రజలు తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి నేరుగా తీసుకువచ్చి, వాటి పరిష్కారం కోసం వినతులను సమర్పించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని అధికారులు స్వీకరించి, సమస్య స్వభావాన్ని పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల ప్రజావాణి కోసం అధికారులు శాఖ వారిగా డెస్క్ లు, హెల్ప్ డెస్క్ ను, మంచినీటి సౌకర్యాలు కల్పించారు.
10,753 మంది అధికారులు హాజరు
మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,753 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజలు సమర్పించిన వినతులను నేరుగా స్వీకరించడంతో పాటు, ఆయా సమస్యలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలపై అధికారులు దృష్టి సారించారు.
జిల్లాల వారీగా వినతుల స్వీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా ఒక జిల్లాకు సగటున 164 వినతులు అందాయి. జిల్లాల వారీగా అత్యధికంగా వినతులు అందిన జిల్లాగా కరీంనగర్ జిల్లా నిలిచింది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 704 వినతులు స్వీకరించబడ్డాయి. అలాగే, ఒక మండలానికి సగటున అత్యధిక వినతులు అందిన జిల్లాగా కూడా కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. కరీంనగర్ జిల్లాలో ఒక్కో మండలానికి సగటున 47 వినతులు అందాయి.
ప్రజలకు మరింత చేరువగా ప్రజావాణి
మండల స్థాయిలోనే ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించడం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా లేదా రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానిక స్థాయిలోనే సంబంధిత అధికారులకు తమ సమస్యలను వివరించే అవకాశం మండల స్థాయి ప్రజావాణి ద్వారా లభించింది.
ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి, వాటిని పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ప్రజలు, అధికారుల నుంచి విశేష స్పందన
మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి, అధికారుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతులు సమర్పించగా, అధికారులు కూడా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు.మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడి, 5,410 వినతులు స్వీకరించబడ్డాయి. ప్రజలు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. మండల స్థాయిలోనే ప్రజల సమస్యలను స్వీకరించి, వాటికి వేగవంతమైన పరిష్కారం అందించడమే ప్రజావాణి ప్రధాన లక్ష్యం.


