ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య, నజ్రియా నజీమ్ జంటగా నటించిన చిత్రం ‘సీన్’. నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషించారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ దీపావళి కానుకగా నేడు(నవంబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథేంటంటే..
క్రైమ్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పని చేసే ప్రేమ్ రాజ్ (సూర్య) తన తెలివి తేటలతో క్లిష్టమైన కేసులను ఈజీగా సాల్వ్ చేస్తుంటాడు. సీరియల్ కిల్లర్ విక్టర్ (టోవినో థామస్)ను అరెస్ట్ చేసిన తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. అది పెండింగ్‌లో ఉండగానే నగరంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవన్నీ సీరియల్ కిల్లర్ విక్టర్ చేసిన మర్డర్స్ మాదిరే ఉంటాయి. విక్టర్ జైల్లో ఉంటే.. బయట ఆ హత్యలు ఎవరు చేస్తున్నారనేది మిస్టరీగా మారుతుంది. అదే సమయంలో ప్రేమ్ సంబంధించిన ఓ సంచలన నిజం క్రైమ్ బ్రాంచ్ చీఫ్ స్టీఫెన్‌కి తెలుస్తుంది. దీంతో విక్టర్ని ఉద్యోగం నుంచి తప్పిస్తాడు. అయినప్పటికీ సీరియల్ కిల్లర్ కేసుని ప్రేమ్ సవాల్‌గా తీసుకుంటాడు. మాయ(నజ్రీయా) సాయంతో ఈ కేసులను విచారిస్తుంటాడు. అసలు ఆ హత్యలు చేస్తున్నదెవరు? ప్రేమ్ ఆ సీరియల్ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నాడు? పై అధికారుల దగ్గర ప్రేమ్ దాచిన నిజం ఏంటి? ప్రేమ్‌కు ఉన్న సమస్య ఏంటి? ఈ కేసు విచారణలో ప్రేమ్‌కి మాయ ఎలాంటి సహాయం చేసింది? ఈ కథలో ఈశ్వరన్ (నస్లేన్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
పోలీసు అధికారిగా పనిచేయాలంటే అడ్డంకిగా మారే ఓ ఆరోగ్య సమస్యతో హీరో బాధపడుతుంటాడు. హీరోయిన్‌కు మరో సమస్య ఉంటుంది. ఇక హీరో తల్లిదండ్రులకూ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలా భిన్నమైన సమస్యలతో సతమతమయ్యే వీరంతా కలిసి ఓ సీరియల్ కిల్లర్ కేసును ఎలా ఛేదించారన్నదే ఈ సినిమా కథ. సూర్యకు ఉన్న ఇమేజ్‌కు భిన్నంగా కథను రూపొందించి, అందులో కామెడీకి పెద్దపీట వేశారు దర్శకుడు జీతూ మాధవన్. క్రైమ్ థ్రిల్లర్‌కు హాస్యాన్ని జోడిస్తూ ఆయన చేసిన ఈ ప్రయత్నం కొంతవరకు ఆకట్టుకుంటుంది.
(చదవండి: రామాయణం మూవీ రివ్యూ)
సినిమా ప్రారంభమైన తొలి పావు గంట సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌లా కథనం సాగుతుంది. అయితే హీరో దాచిన ఓ నిజం బయటపడిన తర్వాత కథ అసలు మలుపు తీసుకుంటుంది. అప్పటి నుంచి కామెడీ, మొదలవుతాయి. ముఖ్యంగా మాయా పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. హీరో, హీరోయిన్ కలిసి చేసే ప్రయాణం, సాగించే ఇన్వెస్టిగేషన్ ఒకవైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. వీరికి హీరో తల్లిదండ్రులు తోడవడంతో వినోదం మరింత పెరుగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా సాగుతూ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతాయి. ఇక ద్వితియార్థంలో కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. అయితే హీరోయిన్ చేసే యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది.
హీరోని వేధిస్తున్న సమస్యకు అసలు కారణమేంటి? అనే ప్రశ్నలకు దర్శకుడు సరైన సమాధానాలు ఇవ్వకపోవడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. మరోవైపు హీరో సీరియల్ కిల్లర్‌ను గుర్తించే విధానం, తొలిసారి అతడిని ఎదుర్కొనే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే మైండ్ గేమ్ సినిమాకు కావాల్సిన థ్రిల్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్ నుంచి కథనం వేగం పుంజుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే కథ, కథనాలు, పాత్రల చిత్రీకరణ మాత్రం లాజిక్కు సుదూరంగా ఉంటాయి. కొన్ని సీన్లు సినిమాటిక్ ఉండటంతో నమ్మశక్యంగా ఉండవు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం, కథనంలో కొత్తదనం లేకపోవడంతో కొన్ని చోట్ల సాదాసీదా సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లాజిక్‌లు వెతకుండా వెళితే ఈ క్రైమ్ కామెడీ చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది. (ఇదీ చదవండి: నయనతార ‘మహాశక్తి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
ఎవరెలా చేశారంటే..
ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య ఒదిగిపోయాడు. గతంలో ఈ తరహా పాత్రను ఆయన చేయలేదనే చెప్పాలి. కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఇరగదీశాడు. ఇక మాయ పాత్రకు నజ్రియా పూర్తి న్యాయం చేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ కూడా చేసింది. ఆ సీన్ అదిరిపోతుంది. ప్రేమలు ఫేమ్ నస్లేన్ సీరియల్ కిల్లర్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. టోవినో థామస్‌ది అతిథి పాత్రే. పార్ట్ 2 మొత్తం ఆయన చుట్టూ తిరిగేలా ఉంది. హీరో తండ్రిగా ఆనంద్ రాజ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. సుశిన్ నేపథ్య సంగీతం బాగుంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.


