కడప కోటిరెడ్డిసర్కిల్ : పాత జీవోను బయటికి చేనేత ధ్రువీకరణ పత్రం జారీ చేలో నిబంధనలు కఠినతరం చేయడం దురదృష్టకరమని చేనేత ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చేనేత పింఛన్‌కు జారీచేసిన విధివిధానాలపైన జిల్లా చేనేత జౌళీ శాఖ కార్యాలయం వద్ద ఆయా నేతలు నిరసన వ్యక్తం చేశారు. అలాగే కలెక్టరేట్‌లోని చేనేత రంగానికి సంబంధించిన కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అవ్వారు మల్లికార్జున మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీఓను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ఈ నెల 11వ తేదీ కడప కొత్త కలెక్టరేట్ వద్ద చేనేత కార్మికులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో అగ్నిప్రమాదం
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఏఐఎల్ డిక్సన్ కంపెనీలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి బసివిరెడ్డి రెండు ఫైర్ ఇంజిన్లు, సిబ్బందితో వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని సంబంధిత అధికారులు వివరించారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
పెళ్లి పేరుతో బెదిరింపులు
ప్రొద్దుటూరు క్రైం : పరిచయాన్ని అడ్డుపెట్టుకొని మహిళను నమ్మించి సుమారు రూ. 35 లక్షలు తీసుకోవడంతో పాటు, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన ఆమెను బెదిరించిన ఘటనలో కర్నాటక వాసిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు మిట్టమడివీధికి చెందిన ఓ మహిళ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న చిక్‌బళ్లాపూర్ జిల్లా, గౌరిబిదనూరు తాలుకా, హోసూరు గ్రామానికి చెందిన గిరీష్‌రెడ్డి అలియాస్ గిరీష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు ఆమె వద్ద నుంచి సుమారు రూ. 35 లక్షలు తీసుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వాలని బాధితురాలు కోరగా, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ వ్యవహారంపై బాధితురాలు చిక్‌బళ్లాపూర్ జిల్లాలో ఫిర్యాదు చేసింది. తనపై ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న గిరీష్ ప్రొద్దుటూరులోని బాధితురాలి ఇంటికి వచ్చి తనకు మరింత డబ్బు ఇవ్వకపోతే ఇద్దరికి వివాహం జరిగినట్లు తప్పుడు వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో బాధితురాలు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గిరీష్ కర్నాటకలోని బెంగళూరులో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
● చేనేతలకు పింఛన్ మంజూరు చేయాలి
● జాతీయ చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వేధించి మోసం చేసిన కర్నాటక వాసి అరెస్ట్


