
నాటి మొక్కే నేటి మహావృక్షం దిశగా అడుగులు
2019లో ఇండస్ట్రియల్ హబ్‌గా ప్రతిపాదనలు
2023లో సీఎం హోదాలో వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం
తాజాగా ఉత్పత్తులను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ఎంఎస్‌ఎంఈ సైతం అమరావతికి తరలించిన వైనం
అన్యాయం చేస్తూనే టీడీపీ వల్లేప్రగతి అంటూ అబద్ధాలు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పారిశ్రామిక ప్రగతి సాధించాలని తద్వారా ప్రత్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పిస్తే... తండ్రి సంకల్పాల్ని సాకారం చేయడానికి గత ప్రభుత్వంలో సీఎం హోదాలో వైఎస్ జగన్ విశేష కృషి చేశారు. మౌళికవసతులు సమకూర్చి పారిశ్రామిక ప్రగతికి అనువైన ప్రాంతంగా కొప్పర్తి పారిశ్రామికవాడను తీర్చిదిద్దారు. ఫలితంగా చైన్నె–విశాఖ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా కొప్పర్తిలో రూ.2,147కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నాటి స్ఫూర్తితోనే నేటి కొప్పర్తిలో ఫలాలందుతున్నాయనే జగమెరిగన సత్యాన్ని మంత్రి నారా లోకేష్ మరిచిపోయారు. అంతేనా..జిల్లాలోని ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ అమరావతికి తరలించే కుటిల యత్నం చేసిన కూటమి సర్కార్ వైనాన్ని కప్పిపెట్టారు. కేవలం ప్రారంభోత్సవాలు చేసి తామే చేశామని గొప్పలు చెప్పుకోవడంపై జిల్లా వాసులు నవ్వుకుంటున్నారు.
● వైఎస్సార్ జిల్లాను పరిశ్రమల ఖిల్లాగా తీర్చిదిద్దాలని కడపకు కూతవేటు దూరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు 6వేల ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పారిశ్రామికవాడకు మౌళిక సదుపాయాలు కల్పించారు. పైగా అందులో డాక్టర్ వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ కూడా నెలకొల్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు ఆహ్వా నం పలుకుతూ లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందడుగు వేశారు.
పెట్టుబడుల వెల్లువ..
వైఎస్సార్ ఈఎంసీలో రూ.10వేల కోట్లు పెట్టుబడులు, దాదాపు లక్ష మందికి ఉద్యోగాలకు ప్రణాళికలు వేశారు. ఇదివరకే నాలుగు షెడ్లలో ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 1300 మందికి ఉద్యోగాలు లభించాయి. 1.5లక్షల చదరపు అడుగుల సామర్థ్యం ఉన్న మరో మూడు షెడ్లను డిక్సన్ కంపెనీ తీసుకుంది. రెండో ప్లాంట్ విస్తరించేందుకు సిద్ధమైంది. డిజికాన్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌పీ, సెల్‌కాన్ రిజుల్యూట్, చంద్రహాస్ ఎంటర్ ప్రైజెస్, యూటీఎస్‌పీఎల్ సంస్థలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ఈ ఆరు సంస్థలు దాదాపు రూ.600 కోట్లు పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా 7500 ఉద్యోగాలు లభించనున్నాయి. అప్పట్లో వీవీడీఎన్ అనే మరో సంస్థ కూడా ఇక్కడ రూ.365 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ద్వారా 6400 ఉద్యోగాలు లభించనున్నాయి. బ్లాక్ పెప్పర్, హార్మోనిసిటి అనే మరోరెండు ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఐఏటీ డివైజ్‌లు, ట్యాబ్ తయారీ తదితర వస్తువులు ఇక్కడే తయారుకానున్నాయి. వీవీడీఎన్‌సంస్థ 5జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, బిగ్ డేటా, ఎనలిటిక్, ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమిత్తం ఆయా సంస్థలు సిద్ధమవడం విశేషం.
వైఎస్ జగన్ కృషితోనే...
సీఎం చంద్రబాబుకు .. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొప్పర్తి పారిశ్రామికవాడలో 2014– 19లో ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అని జిల్లా వాసులు నిలదీస్తున్నారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌లో ఇండస్ట్రీయల్ మెగా హబ్‌గా ప్రతిపాదనలు చేశారు. 2023లో మెగా ఇండస్ట్రీయల్ హబ్‌ను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఫలితంగా పరిశ్రమలు స్థాపనకు మార్గం సుగమమైంది. కాగా ఇక్కడికి మంజూరైన ఎంఎస్‌ఎంఈ టె క్నాలజీ సెంటర్‌ను సైతం అమరావతికి తరలించే యత్నాన్ని కూటమి సర్కార్ చేసింది. పెద్ద ఎత్తు న నిరసన తలెత్తడంతో వెనక్కి తగ్గింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా టీడీపీ పెద్దలు అబద్ధా లు చెబుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.