
ఆమె బరువులు ఎత్తడం మాత్రమే కాదు..మన స్ఫూర్తిని కూడా పైకి ఎత్తుతోంది అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు గుప్పించారు. సాక్షాత్తూ మహీంద్రా గ్రూప్ అధినేతగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆయన లాంటి ప్రముఖుడి నుంచి ప్రశంసలు అందుకున్న ఆమె అత్యంత సాదా సీదా వ్యక్తి. మరీ ముఖ్యంగా 82 ఏళ్ల వయసున్న వృద్ధురాలు.
ఆ వయసులో ఆమె బరువులు ఎత్తడమే విచిత్రం అనుకుంటే ఆ పని ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఉండడం గొప్ప విశేషం. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పరిధిలో ఉన్న పొల్లాచ్చి అనే చిన్న పట్టణానికి చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు ఆనంద్ మహీంద్రాకు ప్రేరణగా నిలిచింది.
శారీరక సామర్ధ్యానికి వయస్సు అడ్డంకి కాదని ప్రపంచానికి నిరూపించడమే ఆ ప్రేరణకు కారణం. ఇటీవల పవర్ లిఫ్టింగ్ ఛాంపియషిప్‌లలో పోటీ పడి అందరినీ ఆశ్చర్యపరిచిన కిట్టమ్మాళ్ ధైర్యసాహసాలు శక్తి సామర్ధ్యాల కథ దానికి ఆనంద్ మహీంద్ర ప్రశంసలు ఇవన్నీ వైరల్‌గా మారాయి.
80 వర్సెస్ 30...
ఇటీవల కునియాముత్తూరులో జరిగిన ’స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా’ పోటీలో కిట్టమ్మాళ్ పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది, అక్కడ ఆమె పోటీ పడింది తన వయసుకు కాస్త అటూ ఇటూగా ఉన్నవారితో కూడా కాదు ఏకంగా 30 ఏళ్లలోపు ఉన్న మహిళలతో పోటీపడింది. పోటీలో పాల్గొన్న మొత్తం 17 మంది ఇతర మహిళలతో పోటీ పడి ఆమె ఐదవ స్థానాన్ని దక్కించుకుంది, ఓపెన్ ఉమెన్స్ విభాగంలో 50 కిలోల బరువును డెడ్‌లిఫ్టింగ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది.
ఇంటి పనులే రాటు దేల్చాయి..
తను ఇంటి రోజువారీ అవసరాల్లో భాగంగా చేసిన పనులే తనను వెయిట్ లిఫ్టర్‌గా మార్చాయి అంటున్నారు కిట్టమ్మాళ్. ప్రతిరోజూ 25 కిలోల బియ్యం సంచులను మోయడం డజన్ల కొద్దీ కుండల నీరు మోస్తూ తీసుకురావడం అలవాటు అయిందని అదే తనను రాటు దేల్చిందని వివరించారు. తద్వారా బలశిక్షణ తనకు సహజంగానే సాధ్యమైందని చెప్పారు.
తన శక్తిని గుర్తించిన తన మనవళ్లు రోహిత్, రితిక్‌లచే మార్గదర్శకత్వంతో తాను ఇంటి బరువుల నుంచి జిమ్ శిక్షణకు మారానని తెలిపారు. గత నెల రోజులుగా డెడ్‌లిఫ్టింగ్ పద్ధతులను నేర్చుకుంంటూ వచ్చానన్నారు. దీనితో పాటే తన స్టామినాకు తన జీవితకాలపు ఆహారపు అలవాట్లు కూడా కారణమయ్యేయేమో అనిపిస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యార్ధులైన ఆధునికులు అందరూ జపిస్తున్న మిల్లెట్ మంత్రాన్ని ఆమె ఎప్పటి నుంచో ఆహారంలో భాగం చేసుకున్నారు. ఆమె (రాగులతో చేసిన జావ సజ్జలతో గంజి... గుడ్లు, మునక్కాయ సూప్, వంటివి తీసుకుంటూ అపరిమిత శక్తి సామర్ధ్యాలను స్వంతం చేసుకున్నారు.
ఆమె గురించి ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే...
82ఏళ్ల వయసులో ఒక మహిళ బరువులు లిఫ్ట్ చేయడం మాత్రమే కాదు మనలోని స్పిరిట్‌ని లిఫ్ట్ చేస్తోంది. ఉత్సాహంగా జీవించడానికి, ధైర్యంగా కలలు కనడానికి మీ లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడూ ఆలస్యం అనేది లేనే లేదని గుర్తు చేస్తుంది. వయస్సు లేదా సాంప్రదాయ జ్ఞానం పరిమితులను నిర్ణయించదు. మీ సంకల్ప శక్తి మాత్రమే నిర్ణయిస్తుంది.
At 82, a woman is lifting not just weights but our spirits., winning powerlifting championships and defying every cliché about age.
She’s a reminder that it’s never too late (or too early) to live with vigour, to dream boldly, and to pursue your goals.
Age or conventional… pic.twitter.com/fCLQO1PoDJ— anand mahindra (@anandmahindra) September 1, 2025
(చదవండి: తీవ్ర మనోవ్యాధికి సంజీవని!)