
మేము కోయంబత్తూరులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళము. మా అబ్బాయి బీటెక్ తర్వాత ఎం. ఎస్. కోసం సంవత్సరం క్రితం అమెరికాకు వెళ్ళాడు. మొదట 6 నెలలు బాగానే ఉన్నాడు. తర్వాత అతని ఆలోచనలు, ప్రవర్తనలు మారాయి. అమెరికాలో ఉన్న పోలీసులు, గూఢాచారులు తనని వెంబడిస్తున్నారని తన మెదడు మీద, ఎలాన్ మస్క్, ట్రంప్ ప్రయోగాలు చేస్తున్నారని అనుమానంతో భయపడుతూ– ఉండేవాడు. ఆ ప్రవర్తన ఎక్కువై బాగా చికాకు చేస్తే అక్కడే ఉండే మా చుట్టాలు 6 నెలల క్రింద ఇండియాకు పంపించారు. ఎయిర్‌పోర్టులో దిగాక నేరుగా చెన్నైలో ఒక ఆస్పత్రిలో అడ్మిట్ చేశాము. ’స్కిజోఫ్రినియా’ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బాగా అగ్రెసివ్‌గా, సూసైడల్ ఆలోచనలతో ఉన్నాడని అక్కడి డాక్టర్లు ఇ.సి.టి. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మా ఫ్యామిలీ డాక్టర్‌ని అడిగితే ఆయన ఇ.సి.టి. వల్ల మెదడు దెబ్బతింటుంది, భవిషత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారని, మేము ఆ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేసి వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లాము. పెద్దగా ఫలితం కనిపించకపోయేసరికి ఇంగ్లీష్ వైద్యం కాకుండా వేరేవైద్యానికి వెళ్ళాము. చాలా రోజులు ఆ మందులు వాడినా ఎలాంటి మార్పూ లేదు. దయచేసి మాకు ఏదైనా మంచి దారి చూపగలరు.
– సోమలింగేశ్వరరావు, కోయంబత్తూరు
చాలామందిలో అంతర్గతంగా ఉండే ఇలాంటి సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు మీకు నా అభినందనలు. మీ అబ్బాయికి వచ్చిన స్కిజోఫ్రీనియా వ్యాధి వలన ఎంతగా సంఘర్షణకి గురయ్యారో అర్థం అవుతోంది. ముందుగా మీరు అర్థం చేస్కోవాల్సింది, మెదడులో వచ్చే కొన్ని రసాయనిక మార్పుల వల్లనే ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయని, అవి తగ్గాలంటే ఆ రసాయనాలని సాధారణ స్థితికి తీసుకురావాలనీ మానసిక వైద్యులు మొదటిగా మందులు, కౌన్సెలింగ్ ద్వారా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు.
అయితే కొన్నిసార్లు ఆ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు లేదా పేషెంటుకి ఆత్మహత్య ఆలోచనలు, జబ్బువల్ల ఇతరులకు హాని చేసేంత ఆవేశం, కోపం, ఉన్నప్పుడు, మందులు పని చేయడానికి చాలా సమయం పట్టొచ్చు: అలాంటప్పుడు పేషెంటుకి కుటుంబ సభ్యులకి జరిగే నష్టం ఎక్కువ. దీన్ని నివారించడం కోసం అత్యంత వేగంగా. ప్రభావ వంతంగా పనిచేసే ఒక సంజీవని లాంటి వైద్య విధానమే’ ఇ.సి.టి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ.
అంతమంచి చికిత్స విధానాన్ని వాడుక భాషలో ‘షాక్ ట్రీట్మెంట్‘ అంటారు. అదే అన్ని సమస్యలకి, అపోహలకి కారణం అయింది. దీనివల్ల మనిషికి ప్రాణహాని అని లేదా నరాలు చచ్చుబడి, సంసారానికి పనికి రారు అని అనేక అపోహలు, సాధారణ ప్రజలతోటు, కొంత మంది వైద్యుల్లో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఇతర జ్ఞానేంద్రియాలు, కండరాలు ఇతర వ్యవస్థలన్ని పనిచేయడానికి మెదడులో ఉత్పత్తి అయ్యే కరెంట్ చాలా ముఖ్యం. దాన్ని మార్చడం ద్వారా మొదడులోని రసాయనాల అసమతుల్యను కూడా సరి చేయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ లేదా కంప్యూటర్ కి వైరస్ వచ్చి పని చేయకపోతే రీసెట్ ‘ బటన్ నొక్కి దాన్ని పనిచేసే కండిషన్‌కి ఎలా తీసుకు వస్తామో ఇ.సి.టి. కూడా మెదడుని అలాగే రీసెట్ చేస్తుంది.
దీనివల్ల దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు వస్తాయని ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ పరిశోధనా తేల్చలేదు. ఒక పేషెంట్ అన్ని రకాలుగా శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే ఇ.సి.టి. చికిత్స చేస్తారు. మీ అబ్బాయిని పరీక్షంచిన డాక్టరు అన్ని పరీక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే ఇ.సి.టి. ట్రీట్మెంట్ గురించి చెప్పి ఉంటారు. కాబట్టి ఎలాంటి అపోహలు, భయాలు లేకుండా చికిత్స ఇప్పించి, మీ వాడి జబ్బు లక్షణాలను తొందరగా తగ్గించుకోండి. మీ అలాగే వాళ్ళు చెప్పినన్ని రోజులు మందులు వాడితే జబ్బు మళ్ళి తిరిగబెట్ట కుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ !
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)
(చదవండి: