
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. తాడిపత్రి సీఐ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల వినాయక నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకున్న గొడవ కారణంగా కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది.
వివరాల ప్రకారం.. టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరుతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినాయక నిమజ్జనం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం ఊరేగింపులో జేసీ, కాకర్ల వర్గీయులు ఎదురుపడ్డారు. పరస్పర నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు. ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మొహరించారు. ఇరు వర్గాలపై లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
అనంతరం, తాడిపత్రి సీఐ సాయి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు.. జేసీ ప్రభాకర్ రెడ్డి సహా మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే, అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడంతో దీన్ని తట్టుకోలేని ఓ టీడీపీ నేత సీఐ సాయిప్రసాద్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సీఐ సెలవుపై వెళ్లినట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, తాడిపత్రి పట్టణ ఇన్‌చార్జ్ సీఐగా బాధ్యతలను మంగళవారం రూరల్ సీఐ శివగంగాధర్‌రెడ్డి స్వీకరించారు.
