
అసెంబ్లీ ఎన్నికల ముందర తమిళనాడులో ఎన్డీయే కూటమికి మరో షాక్ తగిలింది. అమ్మా మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మొన్నీమధ్యే అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం(ఓపీఎస్).. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీవీవీ దినకరన్ కూడా తన మద్దతును ఉపసంహరించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
2024 లోక్‌సభ ఎన్నికల ముందర.. ఎన్టీయే కూటమితో చేతులు కలిపారు దినకరన్. అయితే అన్నాడీఎంకేతో బీజేపీ అంటకాగడం మొదలైనప్పటి నుంచి ఆయన్ని దూరం పెడుతూ వస్తోంది. అయినప్పటికీ జయలలిత అనుచరులతో సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ఓపికగా భరిస్తూ వచ్చారు. ఈ తరుణంలో.. అనూహ్యంగా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు దినకరన్ ప్రకటించడం గమనార్హం.
‘‘ఎన్డీయే కూటమి నుంచి మేం వైదొలిగాం. డిసెంబర్‌లో మా తదుపరి నిర్ణయం ఏంటన్నది ప్రకటిస్తాం. అమ్మ అనుచరులు మాకు దగ్గరవుతారని ఎదురుచూశాం. కానీ, అందుకు అవకాశం లేదని తెలిసిపోయింది. అందుకే 2026 ఎన్నికల కోసం మా దారి మేం చూసుకుంటున్నాం’’ అని దినకరన్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. ఎన్డీయే కార్యక్రమాలకు దినకరన్ కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో కూటమి నుంచి వైదొలగవచ్చనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ దిగ్గజ నేత మూపనార్ వర్ధంతి వేడుకలకు బీజేపీ అగ్రనేత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హాజరయ్యారు. ఆ సమయంలోనే 2026 ఎన్డీయే సీఎం అభ్యర్థి పళనిస్వామినినే అని బీజేపీ మాజీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ప్రకటించారు కూడా. అయితే..
బీజేపీతో పొత్తు ఉండాలంటే పళనిస్వామి, దినకరన్‌లను దూరం పెట్టాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి డిమాండ్ చేసినట్లు ఓ ప్రచారం జోరుగా నడిచింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ చేసిన పన్నీర్ సెల్వం.. కాసేపటికే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ తమిళనాడు రాజకీయాలపై చర్చిస్తున్న వేళలలోనే..దినకరన్ నిష్క్రమణ ప్రకటన చేశారు. ఇప్పుడు ఇదిలా ఉంటే.. థేవర్ కమ్యూనిటీ నుంచి ఇద్దరూ బలమైన నేతలు దూరం కావడంతో దక్షిణ తమిళనాడులో ఎన్డీయే కూటమి ఓట్లపై ప్రభావం పడొచ్చనే విశ్లేషణ నడుస్తోంది.
జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రాజకీయంగా కుదేలునకు లోనవుతూ వస్తోంది. మాజీ సీఎంలు ఈపీఎస్, ఓపీఎస్‌ల వర్గపోరుతో పార్టీ పరువు రోడ్డు మీద పడింది. అటుపై ఈపీఎస్ వర్గానికి అధికారిక గుర్తింపు దక్కడం, ఓపీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినప్పటికీ ప్రతిపక్షంగా నిలబడింది. ఇంకోవైపు.. తమిళనాడులో గ్రాఫు పెంచుకుంటోందిగానీ సీట్ల సంఖ్యను మాత్రం బీజేపీ పెంచుకోలేకపోతోంది. దీంతో ఆ పార్టీతోనే జట్టుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ బలంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.

టీవీవీ.. టీవీకే వైపు.. ?
టీవీవీ దినకరన్.. జయలలిత నిచ్చెలి వీకే శశికళ మేనల్లుడు. గతంలో అన్నాడీఎంకే ట్రెజరర్‌గా, ఉప ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017లో ఆర్.కే.నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2018లో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) అనే కొత్త పార్టీని స్థాపించారు. తమిళనాట రాజకీయాల్లో ఆయన్ని మక్కల్ సెల్వర్‌గా పిలుస్తుంటారు. అయితే.. ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ జోరందుకుంది.

ప్రస్తుతానికి దినకరన్ డిసెంబర్ దాకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే.. గతకొంతకాలంగా ఆయన నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను పొగుడుతూ వస్తున్నారు. గతంలో విజయ్‌కాంత్ రాజకీయాల్లో ఒక ఊపు ఎలా ఊపారో.. విజయ్ కూడా అదే తరహాలో ఊపేస్తున్నారంటూ దినకరన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. తాను ఏ కూటమిలో చేరబోనని, వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే తమ పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు. అయితే కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం దక్కితే వాటా ఇస్తానని మాత్రం స్పష్టత చెప్పారు. దీంతో.. దినకరన్ విజయ్ పార్టీతో పొత్తుకు వెళ్లవచ్చనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే పీఎంకే, వీసీకే, డీఎండీకే లాంటి పార్టీలు టీవీకేతో పొత్తుపై ఉవ్విళ్లూరుతున్నాయి.
పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడం లేదంటే విజయ్ టీవీకేతోపాటు పొత్తు.. అదీ కుదరకుంటే అధికార డీఎంకేతో జట్టులాంటి ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5వ తేదీన జరగాల్సిన మధురై సభను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
