
బీజింగ్: చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు అనంతరం భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత్, రష్యా బంధంపై దాయాది దేశం పాకిస్తాన్ స్పందించింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్‌తో రష్యాకు ఉన్న అనుబంధాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఇదే సమయంలో ఇస్లామాబాద్‌తోనూ మాస్కో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
అయితే, చైనా పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాక్ ప్రధాని షరీఫ్ సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం, షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ..‘గత కొన్నేళ్లలో పాక్-రష్యా సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. అనేక రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. పాక్ పట్ల రష్యా చూపిస్తున్న ఆసక్తి, నిబద్ధతకు ధన్యవాదాలు. ఇంధనం, వ్యవసాయం, రక్షణ, కృత్రిమ మేధ, విద్య వంటి రంగాల్లో మేం రష్యాతో అత్యంత బలమైన సంబంధాలను కోరుకుంటున్నాం. ప్రాంతీయ పురోగతికి అది మంచి చేస్తుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ డైనమిక్ లీడర్. రష్యా-పాకిస్తాన్ సరైన దిశలో వెళ్తున్నాయి. ఇది పాకిస్తాన్‌కు ఎంతో ఉపయోగకరం’ అని కామెంట్స్ చేశారు.
మరోవైపు.. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు ముగిసిన వెంటనే భారత్‌కు రష్యా బంపరాఫర్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్‌లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. అయితే, ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం. మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.