
శైవ సంప్రదాయంలో గణపతిని తలుచుకున్నట్లుగానే వైష్ణవులు తొలిగా విష్వక్సేనుని స్మరిస్తారు, పూజిస్తారు. ఈయన విష్ణుగణాలకు అధిపతి. వైకుంఠసేనాని. సాక్షాత్తు విష్ణువులాగే చతుర్భుజాలతో ఉంటాడు.వారు భాద్రపద మాసంలో పూర్వాషాఢ నక్షత్రంలో ఆవిర్భవించారు. బంగారు వర్ణంతో విశాలమైన కనులతో పుట్టుకతోనే దేహంపై శంఖం, ఖడ్గం, ధనస్సు చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుడతాడు.
ఈయనను కశ్యపమహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాలను నేర్పిస్తాడు. తరువాత వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహంతో సేనాపతిగా అవతరిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య భాగంలో విష్వక్సేనుల వారి సన్నిధి ఉందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. స్వామివారి ఆలయానికి చుట్టూ ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో ఈ సన్నిధి కనిపిస్తుంది.
అయితే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రెండు రోజులు మాత్రమే ఈ ముక్కోటి ప్రదక్షిణ ్ర΄ాంతాన్ని తెరిచి ఉంచడం జరుగుతుంది. అప్పుడు కూడా భక్తుల రద్దీ వలన ఈ సన్నిధి దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ముందుగా సేనాపతి ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈయన నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా వచ్చిన తరువాత వెంకటేశ్వర స్వామి వారు వాహనంపై వేంచేస్తారు.
విష్వక్సేనుడు జ్ఞాన ప్రదాయకుడు. ఈయన నాలుగు చేతులతో పద్మపీఠంపై ఆసీనుడై నిజ హస్తాలతో కుడిచేత అభయ ముద్ర లేక సూచి హస్తం లేక పుష్పాన్ని ధరించి ఉంటాడు.
విష్ణు స్వరూ΄ానికి ఈయనకు ఒకటే తేడా. మహావిష్ణువుకు శ్రీవత్సం బ్రహ్మసూత్రం ఉంటాయి. విష్వక్సేనుడికి అవి ఉండవు. ఈ స్వామి ముక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని పరాశర సంహిత చెప్పింది.
– కె.వి.ఎస్. బ్రహ్మాచార్య, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు