
ఖతర్‌లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.
ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.
గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు.
ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.
ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్‌ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్‌లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.

ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.
(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ)