
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన “తెలుగుభాషా యువభేరి” భారీ విజయం. డాలస్, టెక్సస్‌లో తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత ఐదున్నర సంవత్సరాలగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్యసదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 83వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శ్రీ గిడుగు వెంకట రామమూర్తి (ఆగస్ట్ 29) 162వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన “తెలుగుభాషా యువభేరి” ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలుగు వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది, ఉపాధ్యాయుడు,అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు తెలుగును గ్రాంధిక భాషనుంచి వ్యావహారిక భాషగా మార్చే ప్రయత్నంలో గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి ఘన నివాళులర్పించారు.
“ఈ నాటి ఈ కార్యక్రమంలో 9వ తరగతి చదువుకుంటున్న విద్యార్ధినీ విద్యార్దుల నుంచి ఎం.బి.బి.ఎస్ చదువుతున్న విద్యార్ధుల వరకు కేవలం తెలుగుభాషలో ప్రావీణ్యమే గాక, అవధానాలు చేసే స్థాయికి ఎదగిన యువతీయువకులు చూపిన సాహితీ ప్రతిభ, వెదజల్లిన సాహితీ పరిమళాలు ఇతరులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి అన్నారు.
ఈ ప్రయాణంలో పసితనం నుంచే వీరిలో తెలుగుభాషపై ఆసక్తి, అనురక్తి కలిగించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, ముఖ్యంగా అవధాన విద్యా వికాస పరిషత్ పోషించిన గురుతరమైన పాత్ర ఎంతైనా కొనియాడదగ్గవి అన్నారు” డా. తోటకూర ప్రసాద్
ముఖ్యఅతిధిగా హాజరైన ప్రముఖ సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణచక్రవర్తి మాట్లాడుతూ “నేను పట్టాలు పొందింది తెలుగులో కాదు, చదువుకున్నది ఎం టెక్, ఎం.బి.ఏ. ఐనప్పటికీ తన తాత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, పాఠశాలలో గురువుల శిక్షణ తనకు తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కల్పించి, నేడు తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసకు వెళ్ళాయన్నారు. కనుక చిన్నతనంనుండే పిల్లలకు తెలుగు నేర్పే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు”

విశిష్టఅతిథులు పాల్గొన్న అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - “ఘనమైన గద్యం”; అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - “శతక సాహిత్యం”; బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - “ఆధునిక సాహిత్యం”; శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - “ఉదాహరణకావ్యవైభవం”; అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - “అవధానంలో సామాజిక దృక్పధం”; అష్టావధాని డా. బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - “వర్ణన”; అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్పూర్ (హైదరాబాద్) - “నిషిద్ధాక్షరి”; అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - “తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు”; అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - “అవధాన విద్య-ఒక సమీక్ష” అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – “సమస్యాపూరణం” అనే అంశాల మీద అద్భుత ప్రసంగాలుచేసి అందరినీ ఆశ్చ్యర్య పరచారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో ఈ కార్యక్రమంలో ఈ యువతీ యువకులు చూపిన భాషా పాండిత్య ప్రతిభ చూస్తుంటే తెలుగు భాష భవిష్యత్తుకు ఏ ప్రమాదం లేదనే ఆశ కలుగుతోందన్నారు. పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లింకులో వీక్షించవచ్చు https://www.youtube.com/live/DqCQES2BcwM?si=eRcIZ3B-NFxtUcMX
(చదవండి: ఖతర్‌లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం)